iDreamPost
iDreamPost
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అవి అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్త రాజకీయాలలో కీలక పరిణామాలకు బీహార్ ఎన్నికల ఫలితాలు దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో చేదు ఫలితాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత బీజేపీ చక్రం తిప్పింది. ఆర్జేడీ- జేడీయూ మధ్య వచ్చిన విబేధాలతో నితీశ్‌ని దగ్గరికి చేర్చుకుని ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి జేడీయూ పట్ల వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించి చిరాగ్ పాశ్వాన్ సారధ్యంలో కొత్త కుంపటికి తెర వెనుక నుంచి మద్ధతు ఇస్తుందనే ప్రచారం సాగింది.
తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నప్పటికీ తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ ఎత్తులు మరోసారి ఫలించలేదని తెలుస్తోంది. ఆపార్టీ నేతల వ్యూహాలకు బీహారీలు మద్ధతు పలకలేదని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు గమనిస్తే ఏబీపీ- సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమికి 104 నుంచి 128 మధ్య మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో మహాఘట్ బంధన్‌కి 108- 131 స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తోంది. దాంతో ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సంకేతాలు వస్తున్నాయి.
టుడేస్ – చాణక్య సర్వే ప్రకారం ఎన్డీయే కేవలం 44-56 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతోంది.మహా ఘట్ బందన్ 169-191 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. మొత్తం 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీలో అధికార కూటమికి ఓటమి తప్పదనే సంకేతాలు చాణక్య సర్వేలో తేలింది. ఇక ఇండియా టుడే- యాక్సిస్ సర్వేలో కూడా మహా ఘట్ బంధన్‌కి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టారు. ఏకంగా ఆ కూటమికి 150 స్థానాలు ఖాయమని ప్రకటించారు. దీంతో ఈసారి యువనేత తేజశ్వీ యాదవ్ సర్కారుకి మార్గం సుగమం అవుతుందని ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా బీహార్ లో ఆర్జేడీతో పాటుగా కాంగ్రెస్ కూడా కోలుకుంటుందని వస్తున్న అంచనాలు కీలకంగా మారుతున్నాయి.
రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసిన బీజేపీ కూటమి కేవలం 91 నుంచి 117 మధ్య పరిమితం అవుతుండగా మహాఘట్ బందన్ ఏకంగా 135 సీట్లకు పైగా గెలచుకుంటుందని పేర్కొన్నారు.
ఇక మొత్తం సర్వేలను గమనిస్తే జేడీయూ అత్యధికంగా నష్టపోతుండగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు లాభపడినట్లు స్పష్టమవుతోంది. బీజేపీకి కూడా ఎదురుదెబ్బలు తప్పడం లేదనే సంకేతాలు వస్తున్నాయి.
గత 2015 ఎన్నికలలో ఎన్డీటీవీ ,చాణక్య బీజేపీ గెలుస్తుందని అంచనా వెయ్యగా ఇండియా టుడే-సి వోటర్,ఐటీజీ-సిసిరో,టైమ్స్ నౌ-సి వోటర్ ఇరుపక్షాలు అవకాశం ఉందని,ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. న్యూస్ ఎక్స్-సిఎన్ఎక్స్ మాత్రం నితీష్-లాలు-కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని అంచానా వేసింది.
గత ఎన్నికలకు ఇప్పటికి బీహార్ రాజకీయ పరిస్థితిలో స్పష్టమైన మార్పు ఉంది.మచ్చలేని నాయకుడిగా పేరున్న నితీశ్ ఇమేజ్ పదవీకాంక్షతో దెబ్బతినింది. గత ఎన్నికలలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ను నితీశ్ దూరం చేసుకున్నాడు. శరద్ యాదవ్ లాంటి సీనియర్ నాయకుడిని దూరం చేసుకోవటం నితీశ్‌కు పెద్దదెబ్బ. బీజేపీ కూడా నితీష్ ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రచారం చేయలేకపోయింది.స్థూలంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కలిసివస్తుందన్న సంకేతాన్ని ఈ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. తుదిఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఉంటాయా?లేక ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొడతాయా?మరో రెండు రోజులు వేచి చూడాలి.