iDreamPost
android-app
ios-app

పంపకం పూర్తయింది.. పోరు మిగిలింది..

పంపకం పూర్తయింది.. పోరు మిగిలింది..

కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత దేశంలో తొలిసారి జరుగుతున్న బిహార్‌ శాసన సభ ఎన్నికల్లో రెండు ప్రధాన గ్రూపుల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఇప్పటికే కాంగ్రెస్, ఆర్‌జేడీ, తదితర పార్టీల మధ్య సీట్ల పంపంకం పూర్తవగా.. తాజాగా మరో ప్రధాన కూమిటి, బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డీఏలోనూ సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది.

243 సీట్లు గల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ 121 సీట్లు, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 122 సీట్లలో పోటీ చేయాలని ఒప్పందానికి వచ్చాయి. ఎన్‌డీఏలోకి వచ్చే మరో రెండు పార్టీలకు బీజేపీ, జేడీయూ తమ సీట్ల నుంచి కొన్నింటిని కేటాయించేలా ఇరు పార్టీల నేతలు ఓ అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌ మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఎన్‌డీఏ కూటమిలోకి వచ్చే జితిన్‌ రాం మాజీ నేతృత్వంలోని హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చాకు ఏడు సీట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. 122 సీట్లకు గాను తాము 115 సీట్లలో పోటీ చేస్తామని నితీష్‌కుమార్‌ చెప్పారు.

ఎన్‌డీఏ కూటమిలోకి మరో పార్టీని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలు.. వికాస్‌శీల్‌ ఇన్సాస్‌ పార్టీ నేతలో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే బీజేపీ పోటీ చేసే 121 స్థానాల్లో కొన్నింటిని వికాస్‌శీల్‌ పార్టీకి కేటాయించనున్నారు. మొత్తం మీద ఎన్‌డీఏ కూటమిలో రెండు పెద్ద పార్టీలు, మరో రెండు చిన్న పార్టీలు భాగస్వామ్యులు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.