iDreamPost
android-app
ios-app

బిహార్ : హంగ్ ఏర్ప‌డితే…?

బిహార్ :  హంగ్ ఏర్ప‌డితే…?

బిహార్ పీఠం ఎవ‌రిదో కొన్ని గంట‌ల్లో తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అయితే ఇప్ప‌టికే తేల్చాశాయి. 125 నుంచి 130 స్థానాలతో ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొంటున్నాయి. అంచ‌నాల ప్ర‌కారం కూట‌మికి పూర్తి మెజార్టీ వ‌స్తే ఓకే.. ఒక వేళ హంగ్ ఏర్ప‌డితే..? ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారో అనే దానిపై ఉత్కంఠ ఏర్ప‌డింది. దీనిపై బీజేపీ ఇప్ప‌టి నుంచే రాజ‌కీయాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఏదో విధంగా బిహార్ లో త‌మ పార్టీ చ‌క్రం తిప్పేలా నేత‌లు స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ మానియాతో మరోసారి విజయం సాధిస్తామని జేడీయూ నేతలు మాత్రం ధీమాగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ మాత్రం మ‌రోలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో స్వల్ప మార్పులు జ‌రిగితే.. తేజస్వీతో జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

కాంగ్రెస్ తో జ‌ట్టుకు స‌సేమిరా..?

కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌ట్లో పుంజుకునేలా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వరుస ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంటూ ప్రాభ‌వం కోల్పోతోంది.బిహార్‌లో ఆర్జేడీతో జ‌ట్టు క‌ట్టిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ – ఆర్జేడీ కూట‌మి గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కాంగ్రెస్‌కు నామమాత్రంగానే సీట్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆర్జేడీ పార్టీనే ఎక్కువ స్థానాలలో విజ‌యం సాధిస్తుంది. ఈ నేప‌థ్యంలో యువనేతగా బలమైన పార్టీ పునాదులు కలిగిన తేజస్వీ యాదవ్‌ను తమవైపు తిప్పికునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు తేజ‌స్వీ కూడా కాంగ్రెస్ తో క‌లిసి అధికారం చేప‌ట్టేందుకు అంత‌గా సుముఖంగా లేన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యమంత్రి పీఠంతో పాటు తన తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తేజ‌స్వీ కూడా బీజేపీతోనే జట్టుకట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

టార్గెట్ నితీష్‌..

గత ఎన్నికల సమయంలో తొలుత బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. ఆ తరువాత లాలూతో కలిసి కొన్ని రోజుల తరువాత వారికీ షాకిచ్చి.. అధికారం కోసం రంగుల మార్చిన నితీష్‌ను దెబ్బ తీయాలని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు నితీష్‌పై వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్న క్రమంలోనే మరో దారి చేసుకునేందుకు బీజేపీ నేతలు సైతం సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తేజస్వీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లోక్‌జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ను పురిగొల్పి.. జేడీయూ అభ్యర్థులపై పోటీకి నిలిపినట్లు వార్తలు విస్తున్నాయి. ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీ-జేడీయూ కూటమికి ఎంత నష్టమో.. ఆర్జేడీకి అంత లాభం చేకూర్చింది. అయితే మహాఘట్‌బందన్‌కు సంపూర్ణ మెజార్టీ లభిస్తే తొలుత కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా రేకిత్తిస్తున్న బిహార్‌ తుది తీర్పు కోసం మరికొన్ని గంటలపాటు ఎదురు చూడాల్సిందే.