Idream media
Idream media
ఎన్నికల ముందు బీజేపీతో జతకట్టారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమ మిత్రపక్షం బీజేపీ అని ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ వారి దోస్తీ బాగానే నడిచింది. సీఎం కుర్చీ కూడా ఆ కూటమినే వరించింది. అయితే అధికార పార్టీకి కొంచె సీట్లు తగ్గడం.. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో అసలైన రాజకీయాలు మొదలయ్యాయి. దీంతో సీఎం సీటులో కూర్చున్నా.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రెండ్రోజుల పాటు జరిగిన జేడీయూ రాష్ట్ర మండలి సమావేశాల్లో పాల్గొన్న నితీశ్ కుమార్- రాజకీయాల్లో మిత్రులెవరో శత్రువులెవరో తెలియడం లేదని వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారితీసింది.
బీజేపీ – జేడీయూ మధ్య విభేదాలు
బిహార్లో బీజేపీ- జేడీయూ ప్రభుత్వంలో అభిప్రాయభేదాలు క్రమేణా రాజుకుంటున్నాయి. మంత్రిమండలి విస్తరణ చేపట్టే విషయంలోనూ, పదవుల పంపకంలోనూ విభేదాలు పొడసూపాయి. ‘బీజేపీతో జట్టుకట్టే విషయం ముందే స్పష్టమైనా , సీట్ల పంపిణీ ఖరారు ఎన్నికలకు ఐదునెలల ముందే జరిగి ఉండాల్సింది. అలా జరక్కపోవడం వల్ల మేం చాలా ఇబ్బందులు పడ్డాం. ఇతర పార్టీల (ఎల్‌జేపీ) వల్ల దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నాం. కూటమి పరంగా దాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం. దాని ఫలితం… మాకు సీట్లు తగ్గాయి. నాకు ఇష్టం లేకున్నా బీజేపీ ఒత్తిడి వల్ల సీఎం పదవి చేపట్టాను’ అని నితీశ్‌కుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాక- బీజేపీ ప్రతిపాదిస్తున్న జాతీయ పౌరుల చిట్టా (ఎన్‌ఆర్‌సీ)ని బిహార్లో అమలు చేసేది లేదని ఆయన స్పష్టం చేయడం విశేషం.
ఇదిలాఉండగా.. సీట్ల సర్దుబాటు ఆలస్యం వల్లే బీజేపీ లాభపడిందన్న ఆయన మాట కమలంపార్టీ నేతలకు అసంతృప్తి కలిగించింది. మెజార్టీ సీట్లు మేము సాధించినా తాము నితీశ్‌కే అవకాశమిచ్చామని, ఆయన ఇలా మాట్లాడడం సరికాదని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు. దీంతో పరిస్థితి మరింత చేజారకుండా జేడీయూ దిద్దుబాటు మొదలెట్టింది.. రెండ్రోజుల సమావేశం తరువాత ఓ ప్రకటన విడుదల చేస్తూ- తమ పార్టీ బీజేపీ-సారథ్య ఎన్‌డీఏలోనే కేంద్రరాష్ట్ర స్థాయుల్లో కొనసాగుతుందని స్పష్టం చేసింది. 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో టచ్‌లో ఉన్నారనీ, ఆరు నెలల తరువాత నితీశ్ రాజీనామా ఖాయమని గోపాల్ మండల్ అనే జేడీయూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. బీజేపీతో జేడీయూ సంబంధాలు సజావుగా లేవని అనేకమంది జేడీయూ నేతలు బాహాటంగానే చెబుతుండడంతో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై చర్చ మొదలయ్యింది.