Idream media
Idream media
కరోనా పరీక్షల నిర్వహణ.. వైరస్ కట్టడి నిర్వహణలో దేశంలోనే ముందంజలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనమైన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ చేపడుతున్న చర్యలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. నేరుగా ప్రధాని మోదీ ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశంలోనే ఏపీ ఖ్యాతి పొందిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు తాజాగా.. అతి పెద్ద కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అతి తక్కువ సమయంలోనే.. 1,500 పడకల సామర్థ్యంతో కొవిడ్ కేర్ సెంటర్‌ను అనంతపురం నగర శివారులోని రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఏర్పాట్లు చేసింది. కేవలం రోజుల వ్యవధిలోనే ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. కరోనా వైరస్ బారిన పడ్డ వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో చికిత్సలు అందుకునేలా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 12 బ్లాక్‌ల్లో ఈ సెంటర్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మొత్తం 12 బ్లాక్‌లకు గాను మహిళలకు ప్రత్యేకంగా రెండు బ్లాక్‌లను కేటాయించారు. కోవిడ్ బాధితులకు సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు అక్కడే విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఉండేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా అన్ని వసతులతో కూడిన షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్మాణానికి రూ.8.50 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం.
ఆధునిక వసతులు
12 బ్లాక్‌లకు సంబంధించి రెండు క్లినికల్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈసీజీ, ఎక్స్ రేలకు ప్రత్యేక గదులతో పాటు రక్త పరీక్షలకు ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. కేర్ సెంటర్‌కు పేషంట్ చేరుకోగానే సైన్‌బోర్డులో వివరాలు నమోదు చేస్తారు. ఆ వెంటనే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తారు. ప్రతి పడకకూ ఓ నంబర్ కేటాయిస్తున్నారు. ల్యాబ్‌లో పరీక్షలు పూర్తి అయిన తర్వాత పేషంట్‌కు పడక కేటాయిస్తూ వారి సామగ్రి ఉంచుకునేందుకు ఓ ట్రంక్ పెట్టెను ఇస్తారు. పరుపు, దిండు, కుర్చీ, బకెట్, మగ్ కూడా ఇస్తారు. పేషంట్ల సౌకర్యం కోసం వాల్ మౌంట్ ఫ్యాన్లు, ఫెడస్టల్ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పేషంట్లు నడిచేందుకు వీలుగా ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు.
ప్రత్యేక వంట గది
ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పేషంట్లకు భోజనం అందించేందుకు ప్రత్యేకంగా వంట గదినే ఇక్కడ ఏర్పాటు చేశారు. పేషంట్లు భోజనం చేసేందుకు వీలుగా హాల్ బయట టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్‌బేసిన్‌లను ఏర్పాటు చేశారు. సెంటర్‌లో విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం రెండు బోర్లను వేయించారు. ఒక సంప్ నిర్మాణం చేపట్టారు. అన్ని బ్లాకులకు పూర్తిస్థాయిలో పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను కేర్ సెంటర్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయిస్తున్నారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఉండేందుకూ కావల్సిన చర్యలన్నీ ప్రభుత్వం చకచకా తీసుకుంటోంది.