iDreamPost
android-app
ios-app

భారీ స్కెచ్ తో ప్రభాస్ మల్టీ స్టారర్

  • Published Aug 03, 2020 | 7:40 AM Updated Updated Aug 03, 2020 | 7:40 AM
భారీ స్కెచ్ తో ప్రభాస్ మల్టీ స్టారర్

సాధారణంగా మల్టీ స్టారర్స్ అంటేనే రిస్క్. ఇద్దరు లేదా ముగ్గురు హీరోల అభిమానుల అంచనాలను బాలన్స్ చేయడం అంత సులభంగా ఉండదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లు సులభంగా 14 సినిమాలు చేశారు కానీ ఇప్పుడంత సీన్ లేదు. చిరంజీవి తరం మొదలయ్యాక ప్రేక్షకులు వీటి సంగతే మర్చిపోయారు. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ దిశగా మంచి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్-హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమాకు బాలీవుడ్ స్కెచ్ వేసినట్టుగా గత కొద్దిరోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. రాధే శ్యాం, నాగ అశ్విన్ ప్రాజెక్ట్ తర్వాత ఇదే ఉండొచ్చనే టాక్ బలంగా ఉంది. కానీ కేవలం 60 రోజుల కాల్ షీట్స్ తో పూర్తి చేసేలా ప్లాన్ ఉందట. అదే జరిగితే వైజయంతి మూవీ కంటే ముందే రావొచ్చు. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు

కానీ నిప్పు లేనిదే పొగరాదనే తరహలో మీడియాలోనూ ఈ న్యూస్ బాగా నానుతోంది. అయితే ఇక్కడో అంశాన్ని గమనించాలి. హిందీలో ఇలాంటి మల్టీ స్టారర్లు కొత్త కాదు. కథ డిమాండ్ చేస్తే ఇమేజ్, ఈగోలు పక్కనపెట్టి మరీ స్టార్లు ముందుకు వస్తారు. ఫ్యాన్స్ కూడా అంతగా ఫీలవ్వరు. కాని సౌత్ లో అలా కాదు. ఏ చిన్న తేడా కొట్టినా అభిమానులు రచ్చ చేస్తారు. గతంలో మహా సంగ్రామం, అశ్వమేధం, వారసుడు లాంటి సినిమాల విషయంలో థియేటర్ల వద్ద గొడవలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని యుద్ధాలు చేసుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు. సో వాళ్ళను సంతృప్తి పరుస్తూ హైప్ ని మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. అందులోనూ హృతిక్ రోషన్ కు అక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది. తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా ప్రభాస్ రోల్ తనకన్నా తక్కువగా అనిపించినా ఫలితం ఇంకోలా ఉండే ఛాన్స్ లేకపోలేదు.

మన హీరోలను కాంబో చేయడమే పెద్ద టాస్క్. అలాంటిది నార్త్ సౌత్ కలయిక అంటే వేరే చెప్పాలా. గత ఏడాది హృతిక్ చేసిన వార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కంటెంట్ విషయంలో కామెంట్స్ వచ్చినప్పటికీ జనం ఆదరించారు. కానీ మన దగ్గర అలా కుదరదు. దర్శకుడు ఎవరనే క్లూ కూడా బయటికి రాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తానాజీ ఫేం ఓం రౌత్ ఫిక్స్ కావొచ్చని తెలిసింది. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇకపై ప్రతి సినిమా ఆ రేంజ్ లో చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వంద కోట్ల బడ్జెట్ అనేది చాలా చిన్న మాట అయిపోయింది. కనీసం రెండు వందలు ఉండాల్సిందే. సో ఇప్పుడీ మల్టీ స్టారర్ గురించి మరింత క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. రాధే శ్యామ్ తిరిగి మొదలయ్యాక దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.