iDreamPost
iDreamPost
కరోనా కేసులు తగ్గుతున్న మాట వాస్తవం. మూడో వేవ్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వాతావరణం కొంత బెటర్ గా ఉండటంతో మళ్ళీ మునుపటి రోజులు వస్తాయన్న నమ్మకంతో జనాలు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక థియేటర్లకు కూడా జూలై నుంచి అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సగం సీట్లైనా సరే ముందు తెరిస్తే చిన్నవో పెద్దవో రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కంటెంట్ కి ఎలాంటి కొరత లేదు. కాకపోతే క్రాక్, రెడ్, మాస్టర్ తరహాలో ధైర్యంగా ముందుకొచ్చే నిర్మాతలు కావాలి. ఒకవేళ వీళ్ళు వెనకడుగు వేసినా కూడా మీడియం ప్రొడ్యూసర్లైనా విడుదలకు రాకపోతే అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.
భారీ చిత్రాలు మాత్రం అక్టోబర్ వైపే చూస్తున్నాయి. దసరా పండగను లక్ష్యంగా చేసుకుని ఆ మేరకు లాక్ డౌన్ అయ్యాక బ్యాలన్స్ షూటింగ్ ని వేగవంతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో ప్రధానంగా రాధే శ్యామ్, ఆచార్య, అఖండ లాంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకవేళ కెజిఎఫ్ 2 కనక సెప్టెంబర్ లోపుగా రాకపోతే అది కూడా ఫెస్టివల్ సీజన్ కోసం రెడీ అవుతుంది. అయితే అసలు ఆ డేట్ ని ముందు లాక్ చేసుకున్న ఆర్ఆర్ఆర్, పుష్పలు బరిలో తప్పుకోవడం లాంఛనమే. షూటింగ్ తదితర కార్యక్రమాలు ఇంకా చాలానే బ్యాలన్స్ ఉన్నాయి. ఆలోగా సిద్ధం కావడం కష్టమే.
నిర్మాతల మండలి మాత్రం రాబోయే రోజుల్లో విడుదల విషయంలో క్లాషులకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. పోటీ పడి అయిదారు సినిమాలు ఒకేరోజు రిలీజ్ చేయడం కొత్తేమి కాదు కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల పబ్లిక్ ముందంత ధైర్యంగా థియేటర్లకు రావడం లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టు పోటీకి దిగితే ఓపెనింగ్స్ దారుణంగా దెబ్బ తింటాయి. అసలు ఏవి ఓటిటిలో వస్తాయో ఏవి థియేటర్లకు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే జూలై మీద కూడా డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. ఏదున్నా ఆగస్ట్ నుంచే థియేటర్లలో జనాన్ని చూడొచ్చేమో