Idream media
Idream media
ఏపీలో రాజకీయాలే కాదు.. బదిలీలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉత్తర్వులు జారీ చేస్తుంది ఎవరో..? అమలు చేస్తోంది ఎవరో అర్థం కాకుండా ఉంది. ప్రధానంగా పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌ల బదిలీలపై అయోమయం ఏర్పడింది. వారిద్దరూ ఎన్నికలకు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్య్కులర్ జారీ చేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఎస్ఈసీ ఆదేశాలను పాటిస్తూ వారిని బదిలీ చేశారు. ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. వారి స్థానంలో నియామకం చేసేందుకు గానూ.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికలకు సహకరించని వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతకు ముందే హెచ్చరించారు. దానిలో భాగంగా వారిపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. వార్తలు కూడా అలాగే వెలువడ్డాయి.
వారి బదిలీలపై ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. “పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారు. ఆయన ఇంకా ఎంతమందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం” అని అన్నారు పెద్దిరెడ్డి. దీన్ని బట్టి వారిద్దరిపై ఎస్ఈసీయే వేటు వేసిందనే భావన ఏర్పడుతోంది. ప్రభుత్వం మొదటి నుంచీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను వద్దంటోంది. అలాంటి క్రమంలో వారిని బదిలీ చేసే అవసరం ప్రభుత్వానికి ఉంటుందా..? అంటే లేదనే సమాధానమే వస్తోంది. అందుకు పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి.
ఇద్దరు ఉన్నతాధికారులపై ఎస్ఈసీ వేటు వేశారని అనుకుంటున్న టైమ్ లో ఎన్నికల కమిషన్ తరపున ఓ లేఖ విడుదల కావడం, ఆ ఇద్దరు బదిలీలను తిరస్కరిస్తున్నట్టు అందులో ఉండటం చర్చనీయాంశమైంది. “సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి, రీ షెడ్యూల్ కూడా విడుదలైంది, ఇలాంటి తరుణంలో ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్య కాదు, కొత్తగా వచ్చినవారు ఎన్నికల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లలేరు” అంటూ ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. బదిలీ చేసింది ఎస్ఈసీ అయితే.. దాన్ని కమిషన్ ఎందుకు తిరస్కరిస్తుంది. అనే అనుమానం మొదలైంది. అసలు వారి బదిలీలు నిజమా..? కాదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అలాంటి సమయంలో ప్రభుత్వానికి ఆ అధికారం ఉండదు. మరి అలాంటప్పుడు ఎస్ ఈసీ సిఫార్సుల మేరకు వారిని బదిలీ చేశారా.. చేస్తే బదిలీలు తిరస్కరిస్తున్నట్లు ఆ లేఖ ఏంది..? అనే దానికి సమాధానాలు కరువు.