తెల్లారిన మొదలు నిత్య సంఘర్షణతో మొదలయ్యే జీవితానికి రాత్రి నిద్ర పోయే ముందు మనసు కాస్త రిలాక్స్ కావాలని కోరుకుంటుంది. రకరకాల వినోద కార్యక్రమాలను వీక్షించేందుకు మనసు తహతహలాడుతుంది. అలాంటి వారికి ఈ వందరోజులుగా బిగ్‌బాస్ రియాల్టీ షో-3 కొంత వినోదాన్ని పంచిందంటే అతిశయోక్తి కాదు. కాని ఎటొచ్చి రియాల్టీ షోలో సస్పెన్స్ కొరవడటంతో ఆ మజా లేకపోయింది. షో ముగియడానికి నాలుగైదు వారాల ముందే విజేత ఎవరవుతారో ప్రేక్షకులు ఒక అంచనాకు రావడంతో ప్రేక్షకులకు ఆ కిక్ లేకపోయింది.
వందరోజులుగా నడుస్తున్న ఈ రియాల్టీ షో నేటితో ముగియనుంది. బిగ్‌బాస్ షో నిర్వాహకుల కంటే ముందే అనేక సోషల్ మీడియా సంస్థలు రాహుల్ సిప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించాయి. పలు ఆన్‌లైన్ ఓట్ల ప్రక్రియ ద్వారా ఎవరు ఎక్కువగా ఓట్లు సంపాదించారనే విషయమై అంచనాకు వస్తుండటంతో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా హోస్ట్ నాగార్జున కంటే ముందే బయటి సంస్థలు ప్రకటిస్తూ వచ్చాయి.
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం కంటెస్టెంట్లంతా ఆడుతూ పాడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు యత్నించారు. వందరోజుల్లో ఒక్కొక్కరి మధ్య వారం, రెండు వారాలు..ఇలా రోజులతో సంబంధం లేకుండా ఏర్పడిన బంధాలు, అనుబంధాలు ఇక ఎవరికి వారు అవుతున్న ఫీలింగ్ వారి కళ్లలో తడిని నింపింది.
ఇక మిగిలింది ఆదివారం ఫైనల్ ఎఫిసోడ్. అంటే విన్నర్, రన్నర్ ఎవరెవరనే విషయాన్ని ప్రకటించడమే తరువాయి. విన్నర్‌గా రాహుల్, రన్నర్‌గా శ్రీముఖి అని తెలుస్తోంది. రెండో షోతో పోల్చితే ఓట్ల ప్రక్రియలో ఆర్మీలు, ఇతరత్రా అరేంజ్ సంస్థలు లేకపోవడం ఒకింత సంతోషం కలిగించే అంశం.