iDreamPost
android-app
ios-app

భారత జాతీయ వైద్యుల దినోత్సవం

భారత జాతీయ వైద్యుల దినోత్సవం

సమాజంలో వైద్యులు చేసే సేవను ప్రత్యేకంగా గుర్తించడానికి అన్ని దేశాలు ఒక్కో రోజును వైద్యుల దినోత్సవంగా గుర్తిస్తారు. అమెరికాలో మార్చి 30వ తేదీని జాతీయ వైద్యుల దినంగా గుర్తిస్తారు. అమెరికాలో 1842 సంవత్సరం మార్చి 30న ఆపరేషన్ చేయడానికి మత్తుమందు ఇవ్వడం మొదటిసారి జరిగిన రోజు. కెనడాలో మే 1ని వైద్యుల దినంగా జరుపుతారు. అలాగే భారతదేశంలో జులై ఒకటవ తేదీని జాతీయ వైద్యుల దినంగా గుర్తిస్తారు.

జులై ఒకటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పేరు మోసిన వైద్యులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి కూడా. 1991 నుంచి భారతదేశంలో జులై ఒకటిని డాక్టర్స్ డేగా జరుపుకొవడం మొదలైంది.

బహుముఖ ప్రఙాశాలి డా. రాయ్

రాయ్ పూర్వీకులు మహారాజా ప్రతాపాదిత్యుడు నేటి బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతంలో రాజ్యాన్ని ఏలిన వాడైనా, రాయ్ జన్మించేసరికి వాళ్ళది అతి సాధారణ కుటుంబం. రాయ్ తండ్రి ఉద్యోగరీత్యా పాట్నాలో ఉండగా రాయ్ 1882 జులై ఒకటిన జన్మించారు. అతని తండ్రి తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే రాయ్ తోపాటు మరికొంతమంది అనాధ పిల్లలను కూడా చదివించేవాడు. తనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేయాలనే గుణం రాయ్ ఆ విధంగా తన చిన్ననాటి నుంచి అలవరచుకున్నాడు.

పాట్నాలో మెట్రిక్యులేషన్, గణితంలో బిఏ పూర్తి చేసి, కలకత్తా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేశాడు. అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజన చేయడంతో, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతా భగ్గుమంది. బిధాన్ రాయ్ కష్టమ్మీద ఆ పోరాటంలో దూకకుండా తన మెడిసిన్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత లండన్ లోని సెయింట్ బార్తలోమ్యూ ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడానికి పన్నెండు వందల రూపాయలతో 1909లో లండన్ చేరుకున్నాడు.

అయితే ఒక ఆసియావాసి తన ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడం ఇష్టం లేని డీన్ ఏ కారణం లేకుండా బిధాన్ రాయ్ అప్లికేషన్ తిరస్కరించాడు. రాయ్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. అదీ తిరస్కరణకు గురయింది. ఇలా పట్టువదలకుండా ముప్పై సార్లు ప్రయత్నించి అందులో ప్రవేశించి, రెండు సంవత్సరాల మూడు నెలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, మే 1911లో ఒకేసారి రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ లో సభ్యత్వం, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో ఫెలోషిప్ సాధించిన రికార్డు తన స్వంతం చేసుకున్నాడు

భారతదేశానికి పునరాగమనం

లండన్ నుంచి తిరిగి వచ్చాక కలకత్తాలోని వివిధ వైద్య కళాశాలల్లో బోధకుడిగా పనిచేస్తూ ఒక టి. బి. ఆసుపత్రి, ఒక కేన్సర్ ఆసుపత్రి, మహిళా సేవా సదన్ లాంటి సంస్థలు నెలకొలిపాడు. మహాత్మాగాంధీకి బీ. సీ. రాయ్ మిత్రుడు, వైద్యుడు కూడా.

మిత్రుల బలవంతం మీద 1925లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన బిధాన్ రాయ్ బారక్ పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేసి రాజకీయ కురువృద్దుడు సురేంద్రనాధ్ బెనర్జీ మీద విజయం సాధించాడు.

1928లో కాంగ్రెస్ కమిటీలో, 1930లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం పొందాడు రాయ్. స్వాతంత్య్రం అనంతరం పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా జనవరి 23,1948న ఎన్నికయ్యాడు. దేశ విభజన కారణంగా తీవ్రంగా గాయపడిన బెంగాల్ లో శాంతిభద్రతలు నెలకొల్పడానికి విశేషంగా కృషి చేశాడు.

బిధాన్ రాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1961లో ఆయనకు భారతరత్న పురస్కారం అందించింది. ఆయన 1962 జూలై 1న తన జన్మదినం నాడు, ఎనభై ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కన్ను మూశాడు. ఈ సంవత్సరం నుంచి జులై ఒకటిని రాష్ట్ర సెలవుదినంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.