Idream media
Idream media
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వినూత్న ఆలోచనలకు, ఆశయాలకు మరింత మంది తోడవడంతో తిరుపతిలో మానవ వికాస వేదిక అనే వినూత్న సంస్థ అవతరించింది. రెండునెలల క్రితం ఏర్పాటైన సంస్థకు సంబంధించిన విధివిధానాలతో కూడిన కరపత్రాన్ని 30 ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిద్ధమ్మ, సుబ్బమ్మలతో పాటు భూమన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ
అందరం కలుద్దాం!
ఆలోచనా జ్యోతులై నిలుద్దాం!
మనిషిని మనిషిగా నిలుపుదాం!….ఇది మానవ వికాస వేదిక లక్షణం, లక్ష్యమని తెలిపారు. తనకు రాజకీయాల కంటే కూడా మనుషులను ప్రేమించడం ఇష్టమన్నారు. తన పార్టీకి, మానవ వికాస వేదికకు భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత దూరమని చెప్పారు. ఈ సంస్థ రాజకీయాలకు అతీతమైందని స్పష్టం చేశారు.
మనిషి మనసులో తడి ఉన్నవారెవరైనా ఈ సంస్థలో సభ్యుడేనన్నారు. ఈ మానవ ప్రపంచం మానవీయ పరిమళాలతో పూలతోటలా వికసించాలని ఆకాంక్షించారు. ఎవరికి వారుగా విడిపోతున్నామని, పని ఉంటే తప్ప పలకరించుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నామన్నారు.
రాబోయే తరాల వారికి మానవ విధ్వంసంతో కూడిన సమాజం కాకుండా, పరస్పర ప్రేమానుబంధాలతో కూడిన ఉన్నత మానవ సమాజాన్ని అందించడమే లక్ష్యంగా మానవ వికాస వేదిక పనిచేస్తుందన్నారు. తనను మానవ వికాస వేదిక సంస్థ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పటికీ, తానొక సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు.
మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలకు బదులుగా హార్థిక సంబంధాలు ఏర్పడాలన్నారు. డబ్బు మనల్ని శాసిస్తోందని, ఇది ఇలాగే సాగితే మనుషులెవరూ చివరకు మిగలరని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులు మాత్రమే మిగులుతాయన్నారు. మరుగుజ్జుగా మారుతున్న మనిషి తల గుజ్జులోకి మానవీయ తడిని ప్రవేశ పెట్టాలనే తలంపే మానవ వికాస వేదిక ఆవిర్భావానికి దారి తీసిందన్నారు.
మానవ వికాస వేదిక ప్రతి ఒక్కరిదీ అన్నారు. నిజానికి ఇది మనది, మనసున్న అందరిదీ అని అన్నారు. ఆలోచనాపరులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని భూమన ఆకాంక్షించారు. మనిషిని మనిషిగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.