iDreamPost
android-app
ios-app

తిరుప‌తిలో సైకిల్ పై తిరిగిన భూమ‌న‌.. ఏం జ‌రిగిందంటే…

తిరుప‌తిలో సైకిల్ పై తిరిగిన భూమ‌న‌.. ఏం జ‌రిగిందంటే…

తిరుప‌తి వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆది నుంచీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతున్న స‌మ‌యంలో కూడా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క‌రోనా మృత‌దేహాల‌కు స్వ‌యానా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేవారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైర‌స్ క‌ట్ట‌డికి విశేషంగా కృషి చేస్తున్నారు. సేవా కార్య‌క్ర‌మాల్లో ఎప్పుడూ జ‌నంలో ఉండ‌డంతో ఒక‌సారి క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టికీ.. కోలుకున్న త‌ర్వాత కూడా ధైర్యంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. దీని ద్వారా మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ‌ను ఆయ‌న పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే నిబంధ‌న‌ల ప్ర‌కారం ముఖానికి మాస్కు పెట్టుకుని.. ఎలాంటి సెక్యురిటీ ఆర్భాటం లేకుండా తన నియోజకవర్గంలో గల్లీ గల్లీ సైకిలుపై తిరుగుతూ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు.

కరోనా వేళ కావటంతో ముఖానికి మాస్కు పెట్టుకొని తానెవరో తెలీకుండా జాగ్రత్త పడుతూ.. తిరుపతి వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన పలు వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా తన కళ్లను తాను నమ్మలేని ఉదంతాలు తనకు కనిపించాయని చెప్పారు. తిరుపతిలో గంజాయి.. ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని.. డ్రగ్స్ కు బానిసైన కొందరు యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్న వైనం తన కంట్లో పడినట్లు చెప్పారు. అంతే కాదు.. పరమ దుర్మార్గంగా అమ్మాయిలకు సైతం ఈ మత్తుమందుల్ని అలవాటు చేసి వారిని వల్లో వేసుకొని పశువాంఛ తీర్చుకుంటున్నారంటూ సంచలన విషయాల్ని వెల్లడించారు. ఒక సామాన్య వ్యక్తిగా సైకిల్ మీద తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే.. మత్తులో ఉన్న యువకుల్ని తాను చూసినట్లు చెప్పారు. అలాగే ప‌లు స‌మ‌స్య‌ల‌ను గుర్తించి ప‌రిష్క‌రానికి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతిలో గంజాయి అమ్మకాల్ని గుర్తించిన వెంట‌నే వాటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరిన భూమన.. తిరుపతి ఎస్పీ అప్పలనాయుడ్ని స్వయంగా కలిసి మూడు పేజీల కంప్లైంట్ ఇచ్చారు. మ‌రో ప‌ది రోజుల త‌ర్వాత మరోసారి మాస్కు పెట్టుకొని సైకిల్ ఎక్కి తిరుపతిలో తిరిగితూ మార్పులు గ‌మ‌నిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిజంగా ఎమ్మెల్యే భూమ‌న వేస్తున్న అడుగులు, చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుప‌తిని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని భూమ‌న చెబుతున్నారు.