Idream media
Idream media
ఓకే..ఓకే భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి చెబుతున్నట్టు అక్కగార్లపై తమ్ముడు కేసు వేసినట్టు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేకపోతే మంచిదే. ఒకవేళ అదే నిజమైతే భూమా అఖిలప్రియారెడ్డి, చెల్లెలు మౌనికారెడ్డి, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డితో కలిపి అందరినీ “జగత్”కిలాడీలంటారా లేదా అనే విషయాన్ని జగత్‌విఖ్యాత్ చెబితేనే బాగుంటుదని వారు అనుచరులే ప్రశ్నిస్తున్నారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె చెల్లెలు మౌనికారెడ్డిలపై సొంత సోదరుడైన జగత్‌విఖ్యాత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం (ఇప్పుడు గండిపేట) మంచిరేవులలో సర్వేనంబర్ 190, 192/A, 92/Bలలో ప్లాట్ నంబర్ 9, ప్లాట్ నంబర్ 20 కింద వెయ్యి గజాల స్థలం విక్రయంపై కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ నెల 14న దాఖలైన పిటిషన్ సంచలనం రేకెత్తించింది. సోషల్ మీడియాతో పాటు వివిధ చానళ్లలో భూమా కుటుంబం ఓ పథకం ప్రకారమే కోర్టులో కేసు వేసినట్టు విశ్లేషించాయి. దీంతో తమ కుటుంబానికి డ్యామేజీ అవుతున్నదని గుర్తించిన భూమా కుటుంబం సాయంత్రానికి మేల్కొనింది.
దుబాయ్‌లో ఉన్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి స్పందించాడు. విఖ్యాత్ మాట్లాడిన 34 సెకెండ్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేశాడు. అందులో ఆయన…”పొద్దున్నుంచి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేనేదో కేసులు వేశానని. నేను దుబాయ్‌లో ఉండడంతో ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నాను. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికీ తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మకండి. అవ్వన్నీ అవాస్తవాలు. మేమందరం కలిసే ఉన్నాము. పొద్దున కూడా మేము భూమా క్యాడర్‌ని , భూమా కుటుంబాన్ని ఎలా బలపరచాలో అలోచిస్తున్నాం. మచ్చ వచ్చే విధంగా ఏరోజూ పనిచేయము. దయచేసి మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మకండి. మేమంతా కలిసే ఉన్నాం” అని చెప్పుకొచ్చాడు.
అయితే ఆయన మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దంటున్నాడే తప్ప, కేసు గురించి వివరించలేదు. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి…నేనేదో కేసులు వేశానని మాత్రమేనంటూ తప్పించుకున్నాడు. నిజంగా కోర్టులో కేసు వేయలేదని చెప్పేందుకు అతని అంతరాత్మ ఒప్పుకున్నట్టు లేదు. పైగా తామంతా కలిసే ఉన్నామంటున్నాడు. అంటే అంతా కలిసే కుట్రలు చేస్తున్నారని అనుకోవాలా?తాను కేసు వెయ్యలేదని జగత్‌విఖ్యాత్‌రెడ్డి చెప్పినా ఆ కేసు FIR పాత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవుతుండటం గమనార్హం.
వదినకు వ్యతిరేకంగా దాఖలైన కేసును మరిది టేకప్ చేయడంలోనే అసలు తిరకాసు ఉందని జనాలు అనుకుంటున్నారు. అసలు తమ వాళ్లకైతే ఇలాంటి పాడు ఆలోచనలు రావని, దీని వెనుక మరెవరి ప్రోద్బలమో, దుర్బుద్ధో ఉందని భూమా సన్నిహితులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సహజంగా జగత్‌కు ఇతరుల సొమ్మ ఆశించే మనస్తత్వం లేదంటున్నారు. అతన్ని అడ్డు పెట్టుకుని మరెవరో సొమ్ము చేసుకోవాలనే కుట్రలో భాగమే ఈ కేసని భూమా కుటుంబ సభ్యులు అంటున్నారు.
భూమా జగత్‌విఖ్యాత్ మీడియా ప్రచారాలను నమ్మకండని చెప్పినంత మాత్రాన నమ్మకపోయే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే కేసు డాక్యుమెంట్లతో సహా మీడియాలో చూపారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న భూమా అక్కచెల్లెళ్లు, సోదరుడు చెప్పుడు మాటలు వింటూ రాజకీయ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని భూమా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూమా అఖిలప్రియ, మౌనికలపై జగత్‌విఖ్యాత్ కోర్టుకెళ్లడం, తిరిగి తామంతా కలసే ఉన్నామని అతను ప్రకటించడం, వారికి లాయర్‌గా ఇంటి అల్లుడి సోదరుడే కావడం….అంతా ఫ్రీప్లాన్ డ్రామాగా అనిపిస్తోందని భూమా సన్నిహితులు చెబుతున్నారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని, నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే జీవిత కాలం చాలదని వారంటున్నారు. అలాంటిది ఇప్పుడీ అక్కాచెల్లెళ్లు, తమ్ముడు కలసి ఆడిన డ్రామా చూస్తుంటే, వారిని నమ్మి రాజకీయాలు ఎలా చేయాలని వారి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
భూమా నాగిరెడ్డి అనుచరుల కోసం ప్రాణాలైనా ఇచ్చేవారని, ఇప్పుడాయన పిల్లలు నమ్మిన వారిని నట్టేట ముంచేలా ఉన్నారనే హెచ్చరికను ఈ కేసు ద్వారా పంపుతున్నారని అనుచరులు, బంధువులు, సన్నిహితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జగత్ వీడియోలో చెబుతున్నట్టు మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దనే అనుకుందామని, ఒకవేళ నిజమైతే మిమ్మల్ని “జగత్”కిలాడీలని అనరా భూమా సిస్టర్స్ అండ్ బ్రదర్ అని వారు ప్రశ్రిస్తున్నారు. మచ్చ తెచ్చే పనులు చేయమని విఖ్యాత్‌తో చెప్పించిన వారికి, చెప్పిన వారికి ఈ మాటలు వినిపిస్తున్నాయా?