iDreamPost
android-app
ios-app

అఖిల వ్యవహారశైలి తో ఆందోళ‌న‌లో భూమా వ‌ర్గీయులు

అఖిల వ్యవహారశైలి తో ఆందోళ‌న‌లో భూమా వ‌ర్గీయులు

కర్నూలు రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా నాగి రెడ్డికి గ‌ట్టి ప‌ట్టు ఉండేది. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో నేరుగా పరిచయం ఉన్న భూమా.. తన వారి కోసం, తన వర్గం కోసం ఎంతకైనా పోరాడుతారనే పేరు పొందారు. ఎవరికైనా భూమా హామీ ఇస్తే దానిని నెరవేర్చే వారని అంటారు. అందుకే క‌ర్నూలు జిల్లా రాజ‌కీయంలో భూమా కుటుంబం ఓ వెలుగు వెలిగింది. పార్టీలు ఏవైనా తమ ప్ర‌తిష్ట‌ను నిలుపుకున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల హ‌యాంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న‌ప్పుడు, ఆ త‌ర్వాత కూడా ఎక్క‌డా భూమా ప్ర‌భ త‌గ్గ‌లేదు. పార్టీ అధికారంలో ఉన్నా, లేక‌పోయినా.. ఒకే స్థాయి విలువ‌ను పొందారు. అయితే.. ఒకే ఒక యాక్సిడెంట్ ఆ కుటుంబం రాజ‌కీయ గ‌మ‌నాన్ని మార్చేసింది.

భూమా శోభా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత భూమా కుటుంబ రాజ‌కీయ పయ‌నంలో అనేక త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డాయి. ఆరేళ్లు గ‌డిచే స‌రికి ఒక కిడ్నాప్ కేసులో భూమా నాగిరెడ్డి కూతురు అరెస్టు కావ‌డం ఓ ఎత్త‌యితే, త‌ప్పుడు స‌ర్టిఫికెట్లు జ‌త‌ప‌ర‌చ‌డం, కేసు నుంచి త‌ప్పుకోవ‌డానికి అడ్డ‌దారులు తొక్క‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భూమా నాగిరెడ్డి వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అఖిల అనుస‌రిస్తున్న తీరుపై నాగిరెడ్డి వ‌ర్గీయులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌ప్పు అయినా, ఒప్పు అయినా నిర్భ‌యంగా, బ‌హిరంగంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డం నాగిరెడ్డికి అల‌వాటు. అలాగే త‌ప్పు చేసినా, ఒప్పు చేసినా త‌న అనుకున్న‌వాళ్ల‌ను కాచుకుని ఉండేవారు. కానీ, అఖిల తీరు కొంద‌రికి న‌చ్చ‌డం లేదట‌.

తప్పు ఒకసారి జరిగితే అయ్యో పాపం.. పొరపాటున చేశారేమో అనుకోవచ్చు. అదే పనిగా తప్పులు చేస్తే.. లేనిపోని తిప్పలు ఖాయం. ఈ విషయాన్ని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆమె భర్తకు అర్థమైనట్లుగా అనిపించట్లేదు. భూమి వివాదానికి సంబంధించి తన తండ్రికి ఒకప్పుడు బాగా దగ్గరైన ప్రవీణ్ రావు సోదరుల్ని కిడ్నాప్ చేసిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలంగా మారిన వారు.. వందల కోట్ల రూపాయిలు విలువ చేసే భూమికి సంబంధించిన విషయంలో పంచాయితీ స్థాయి దాటిపోయి.. అనూహ్యంగా కిడ్నాప్ చేయటం.. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగటం తెలిసిందే. కిడ్నాప్ కేసు విచారణ కోసం జులై 3న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్.. సోదరుడు జగత్ విఖ్యాత్ లు గైర్హాజరు అయ్యారు.

కోర్టుకు రాలేకపోవటానికి సరైన కారణం చెప్పాల్సింది పోయి.. అందుకు భిన్నంగా నకిలీ సర్టిఫికేట్ ను న్యాయస్థానానికి ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యారు. కిడ్నాప్ కేసు విచారణ కోసం హాజరు కావాల్సిన వేళ.. తనకు.. తన బావమరిదికి కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఫ్రూప్ పేరుతో నకిలీ ధ్రువపత్రాల్ని అందజేశారు. అయితే.. అవన్నీ నకిలీవి అన్న విషయాన్ని గుర్తించారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా వారు అందజేసిన పత్రాల్నిచెక్ చేయగా.. అవన్నీ నకిలీవిగా తేలింది. దీంతో బోయిన్ పల్లి పోలీసులు వారిపై మ‌రో కేసు నమోదు చేశారు. ఈ కేసుల వ్య‌వ‌హారం, అఖిల త‌ప్ప‌ట‌డుగులు భూమా నాగిరెడ్డి వ‌ర్గీయుల‌కు అంత‌గా రుచించ‌డం లేద‌ట‌.

ఆట ఇప్పుడే మొద‌లైంద‌ట‌..

ఆస్తుల కోసం పోరాటం కాదని, హక్కు కోసం పోరాడుతున్నామని టీడీపీ నేత భూమా అఖిలప్రియ అన్నారు. ఆట ఇప్పుడే మొదలైందన్నారు. గర్భవతిని కాబట్టే బయటికి రాలేదని, డాక్టర్ సలహా మేరకే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నామని చెప్పారు. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతో పాటు.. శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే తనను డైరెక్ట్‌గా ఎదుర్కోండని సవాల్ విసిరారు. తప్పుడు కేసులతో పోలీసులను అడ్డుపెట్టుకొని వేధించొద్దన్నారు.