iDreamPost
iDreamPost
దేవీ నవరాత్రులు అనగానే విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గ అమ్మవారు జ్ఞప్తికి వస్తారు. ఆ తరువాత అంతటి పేరొందిన అమ్మవారు భీమవరం ‘మావుళ్లమ్మ’. ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఏటా లక్షల మంది భక్తులకు దర్శనమిస్తారు. ఆది పరాశక్తి అయిన లలితాదేవి అనేక ప్రాంతాల్లో.. అనేక రూపాల్లో వెలిసి భక్తులను కాపడుతుంది. ఆమె భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి రూపంలో వెలిసినట్టు భక్తుల విశ్వాసం. మావుళ్లమ్మ అమ్మవారు పండితులు పూజించే శ్రీమాతగానే కాకుండా… పామరులు తమ తల్లిగా, తమ ఇంటి బాధలు తీర్చే కరుణారసవల్లిగా.. తమ గ్రామాన్ని కాపాడే గ్రామదేవతగా భావించి పూజిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్ధాల క్రితం వెలిసిన అమ్మవారు శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతుంది. మరే దేవతకు లేని విశిష్ఠ రూపం ఆమెకు ఉందని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మిక చరిత్ర ప్రకారం 1880లలో వైశాఖమాసం రోజుల్లో భీమవరంలో అమ్మవారి వెలిశారని చరిత్ర చెబుతుంది. గ్రామానికి చెందిన మారెళ్ల మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని చెప్పారని, తరువాత ఆ ప్రాంతంలో వెతకగా ఆమ్మవారి విగ్రహం లభ్యమైంది. అమ్మవారి విగ్రహం ఉన్న చోట ఐదు దీపాలు వెలుగుతూ కనిపించాయి. ఆమ్మ ఆదేశం మేరకు అక్కడ చిన్నపాక వేసి ఆలయాన్ని నెలకొల్పారు.
ఆ ప్రాంతంలో అప్పట్లో మామిడి తోటలు ఎక్కువగా ఉండేవి. మామిడితోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో ‘మామిళ్లమ్మ’గా పిలిచేవారని, వాడుకలో అదికాస్తా ‘మావుళ్లమ్మ’గా మారింది అని కొందరు చెబుతారు. మరికొందరు చెప్పేదాని ప్రకారం చుట్టుపక్కల ఉన్న ఊళ్లను కాపాడే అమ్మకాబట్టి ‘మా ఊరి అమ్మ’ అని పిలిచేవారని, ఆది కాస్తా కాలక్రమేణా మావుళ్లమ్మగా మారిందంటారు. భీమవరంలో ప్రస్తుతం మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం సమీపంలో ఉన్న వేప, రావి చెట్టు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్టు స్థానికులు చెబుతుంటారు. తొలుత అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని తరువాత కాలంలో భీమవరం నడి మధ్యకు తీసుకువచ్చారు. అమ్మవారికి దసరా సమయంలో ఉత్సవాలు, సంక్రాంతిలో జాతర వేరువేరుగా జరుగుతుంది. మొదట్లో అమ్మవారికి అర్చకునిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్లు, పూల వర్తక సంఘంవారి ఆధ్వర్యంలో మరొకసారి ఉత్సవాలు జరుగుతాయి.
Also Read : కోనసీమ లో 186 ఏళ్లుగా జరుగుతున్న చెడీతాలింఖానా గురించి తెలుసా..?
1910లో భీమవరాన్ని గోదావరి వరదలు ముంచెత్తడంతో అమ్మవారి విగ్రహం చాలా వరకు దెబ్బతింది. దీనితో 1920లో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. శక్తి స్వరూపిణి కావడంతో అమ్మవారి విగ్రహాన్ని నాగభూషణాచార్యులు భీకరరూపంలో తిర్చిదిద్దారు. అమ్మవారిని రూపాన్ని దర్శించేందుకు భక్తులు భయపడేవారు. తరువాత గ్రంథి అప్పారావు అనే శిల్పి అమ్మవారి విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దగా భక్తులు ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణామూర్తిగా దర్శనమిస్తారు. చతుర్భుజి అయిన అమ్మవారి విగ్రహం 12 అడుగులు ఎత్తు. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమకరం, కలశం ఉన్నాయి. అమ్మవారు శక్తి స్వరూపులైనా గర్భాలయానికి ఇరువైపులా అహింసావాధులైన రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు విగ్రహాలు ఉండడం విశేషం.
భక్తులు అమ్మవారికి హుండీలలో పెద్ద మొత్తంలో మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా అమ్మవారికి చీరలు మొక్కుగా చెల్లిస్తారు. చీరలు వంటివాటి వేలం ద్వారానే అమ్మవారి ఆలయానికి ఏడాదికి రూ.రెండు కోట్ల వరకు ఆదాయం వస్తుందంటే భక్తుల తాకిడి ఊహించుకోవచ్చు. ఈ క్షేత్రంలో భక్తులకు ప్రతీ రోజు పులిహోరను ప్రసాదంగా ఉచితంగా అందజేస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరిస్తారు. ప్రతీ రోజు కుంకుమార్చన, చండీ హోమం వంటి పూజలు జరుగుతుంటాయి.
Also Read : కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?
దసరా ఉత్సవాలు, జాతర సమయాల్లో విద్యుత్ దీపాల అలంకరణలో అమ్మవారి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతుంది. స్వర్ణశోభితమైన మావుళ్లమ్మ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటుంది. దసర నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొక్కుబడులు తీర్చుకుంటారు. భీమవరం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. పక్కనే ఉన్న తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కరోనాకు ముందు నవరాత్రుల సమయంలో 75వేలకు పైబడి వస్తారని అంచనా. కరోనా ఆంక్షలు కారణంగా ఈ ఏడాది భక్తులు సంఖ్య తక్కువగా ఉంది.
ప్రతీ ఏటా జనవరి 13వ తేదీ భోగి పండుగ నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల చివరి ఎనిమిది రోజులు అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మందికి భక్తులకు అన్నదానం జరుగుతుంది.
ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు, జాతరలకు ఇక్కడ పెద్ద ఎత్తున సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. విశేషం ఏమిటంటే ఈ ప్రదర్శనలలో అతరించిపోతున్న కళలకు పెద్ద పీఠ వేస్తారు. బుర్రకథలు, హరి కథలు, కోలాటలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు వంటి ప్రదర్శనలు జరుగుతాయి. ఏటా చివరి రోజు ఒక సినీనటుడుని సత్కరించి, స్వర్ణకిరీటం బహూకరించడం అనవాయితీగా వస్తుంది. అలనాటి మేటి నటులు స్వర్గీయ ఎస్.వి.రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, అల్లు రామలింగయ్య, అంజలీదేవి, కాంతరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, అలాగే కైకాల సత్యనారాయణ, నూతన ప్రసాద్, బ్రహ్మానందం వంటి నటలుకు ఇక్కడ సన్మానం చేసి స్వర్ణకిరీటాన్ని బహూకరిస్తుంటారు. ఇదంటి భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం.
Also Read : కోటప్పకొండ మహాశివరాత్రి.. ప్రభల సంస్కృతీ వైభవం