iDreamPost
android-app
ios-app

మీలా దున్నపోతులా ఉండలేను.. రఘునందన్ పై భట్టి విక్రమార్క తిట్ల దండకం

  • Published Jun 27, 2021 | 1:29 AM Updated Updated Jun 27, 2021 | 1:29 AM
మీలా దున్నపోతులా ఉండలేను.. రఘునందన్ పై భట్టి విక్రమార్క తిట్ల దండకం

ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. తన వ్యక్తిత్వానికి భిన్నంగా తిట్ల దండకం అందుకున్నారు. దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దున్నపోతులు, వెధవలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అంతలా విరుచుకుపడ్డది.. బీజేపీ నేతలపైనే. ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాము సీఎం కేసీఆర్ తో భేటీ అయినందుకు పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇంతకీ ఏమైంది?

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ గురించి మాట్లాడేందుకు శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వెళ్లారు. సుమారు గంటపాటు చర్చించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం, కుమారుడికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఘటనకు కారణమైన పోలీసులను డిస్మిస్ చేయాలని డీజీపీని ఆదేశించారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేయాలని చూసింది. కేసీఆర్ కు లబ్ధి చేసేందుకే కాంగ్రెస్ నేతలు వెళ్లారన్నట్లుగా విమర్శలు చేసింది. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ లీడర్లను కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకున్నారని, టీఆర్ఎస్ కు బీ టీమ్ మాదిరి కాంగ్రెస్ వ్యవహరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ ను తాకట్టుపెట్టేందుకే ప్రగతి భవన్ కు పోయారని విమర్శించారు.

కాంగ్రెస్ కౌంటర్ అటాక్..

దళిత మహిళను అన్యాయంగా చంపేస్తే, న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లామని.. ఇలాంటి అంశాన్ని కూడా రాజకీయం చేస్తారా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కౌంటర్ అటాక్ చేశారు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లు పెడుతున్నారంటూ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎంను కలవకూడదా అని ప్రశ్నించారు. ఇక మల్లు భట్టి విక్రమార్క కోపం కట్టలు తెంచుకుంది. ‘‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా.. శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా. నువ్వు సిద్దిపేటకు వెళ్లి హరీశ్ రావుకు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కు ఎందుకు పిటిషన్లు ఇచ్చావు?’’ అంటూ నిలదీశారు. ‘‘నా నియోజకవర్గానికి చెందిన మహిళ మరణిస్తే మీలా దున్నపోతులా మాట్లాడకుండా ఉండలేను. ఆయన నియోజకవర్గంలో ఇలాగే జరిగితే ఇంట్లో నిద్రపోతారా.. ఏ ఆలోచన లేని వెధవలు అలా మాట్లాడతారు. రఘునందన్‌రావును గెలిపించుకోవడం దుబ్బాక ప్రజల దౌర్భాగ్యం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు వెళ్లామో తెలుసా?

తాము ప్రగతి భవన్ కు వెళ్లడానికి కారణాలను కూడా భట్టి విక్రమార్క వెల్లడించారు. మరియమ్మ లాకప్ డెత్ పై ఫిర్యాదు చేసేందుకు తాము గవర్నర్ వద్దకు వెళ్లామని, తిరిగి వస్తుండగా ఫోన్ వచ్చిందన్నారు. కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న దళిత ఎంపవర్ మెంట్ స్కీమ్ గురించి చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారని చెప్పారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశానని, దాంతో సీఎం తమకు అపాయింట్ మెంట్ ఇచ్చారని చెప్పారు. అందుకే తాము వెళ్లి పరిస్థితిని వివరించామని తెలిపారు.