iDreamPost
iDreamPost
అతను ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకున్న అభ్యుదయవాది.. ప్రజలకు మేలు చేయడమే రాజకీయమని చాటిన రాజకీయవాది. మంత్రిగా ఉన్నా తనయుడి పెళ్లి నిరాడంబరంగా జరిపిన వాస్తవవాది.. మొత్తంగా విలువలకు పట్టం కట్టి జీవితాంతం వాటినే ఆచరించిన ఆదర్శ నాయకుడు భాట్టం శ్రీరామ్మూర్తి. తాను నమ్మినదానికి.. ప్రజలకు చెప్పిన సిద్ధాంతాలకే కట్టుబడిన భాట్టంలాంటి వారే నేటి, రేపటి తరం రాజకీయులకు ఆదర్శప్రాయులు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో
ఒకప్పటి విశాఖ, ఇప్పటి విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామంలో సాధారణ కుటుంబానికి చెందిన నన్నయ్య, తరుణమ్మ దంపతుల పుత్రుడైన భాట్టం శ్రీరామ్మూర్తి బీఏ డిగ్రీ అనంతరం న్యాయశాస్త్రం అభ్యసించారు. విజయనగరంలో చదువుకుంటున్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1945-46లో విజయనగరం టౌన్ స్టూడెంట్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 1946-47లో మహారాజా కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పని చేశారు. సోషలిస్ట్ భావజాలం నిండుగా ఉన్న ఆయన సోషలిస్ట్ పార్టీలో చేరారు. రాంమనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి ప్రముఖ సోషలిస్ట్ నేతలతో సన్నిహితంగా మెలిగారు.
సోషలిస్టు పార్టీ తరఫునే తొలిసారి అసెంబ్లీకి
సోషలిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే భాట్టం 1957లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిగా గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆనాడు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న పీవీజీ రాజు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో అసెంబ్లీ ఉప ఎన్నిక అవసరమైంది.
20 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగిన భాట్టం 1962లో కూడా విజయనగరం నుంచి సోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. తర్వాత కాంగ్రెసులో చేరి విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి 1972, 1978 ఎన్నికల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య ప్రభుత్వాల్లో ఎనిమిదేళ్లు మంత్రిగా పని చేసి పలు శాఖలు నిర్వహించారు.
భాషాభిమాని, పాత్రికేయుడు కూడా..
కౌలాలంపూర్ లో జరిగిన ప్రపంచ రెండో తెలుగు మహాసభలు భాట్టం సారథ్యం వహించారు. ఆనాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఈ సభలు నిర్వహించాల్సి ఉండగా కారణాంతరాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు. దాంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న భాట్టం వెళ్లి సారథ్యం వహించడమే కాకుండా అద్భుతమైన తెలుగు ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
పీవీ కేబినెట్లో సభ్యులుగా ఉన్న మండలి, భాట్టంలను జంట కవులు అనేవారు. తర్వాత జలగం వెంగళరావు ప్రభుత్వంలోనూ వారిద్దరూ మంత్రులయ్యారు. అయితే వారి శాఖలను మాత్రం ఒకరిది మరొకరికి మార్చారు. దానిపై భాట్టం స్పందిస్తూ జలగంవారు కుండమార్పిడి చేశారని చతురోక్తి విసిరారు. తెలుగు భాషపై మమకారం, పట్టు ఉన్న ఆయన పాత్రికేయుడిగా కూడా పనిచేశారు. 1947, 48లలో జయభారత్ పత్రికకు ఉప సంపాదకుడిగా, 1969లో ప్రజారథం, 1970-72 మధ్య ఆంధ్ర జనతా పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు.
పిలిచి టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్
కాంగ్రెసులో సుదీర్ఘకాలం పనిచేసిన భాట్టం శ్రీరామ్మూర్తి 16 ఏళ్లు ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న భాట్టం నిబద్ధతను గుర్తించిన ఎన్టీఆర్ ఆయన్ను పిలిచి మరీ 1984 ఎన్నికల్లో విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా తొలిసారి లోకసభలో అడుగుపెట్టిన ఆయన రాష్ట్ర సమస్యలు, జాతీయ అంశాలపై చర్చల్లో చురుగ్గా పాల్గొని తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునేవారు. లోకసభ సమావేశాలు జరిగే రోజుల్లో నిత్యం ఆయన వాణి వినిపించేది. ఆ తర్వాత సమకాలీన రాజకీయాల్లో ఇమడలేక దూరమయ్యారు.
నిరాడంబర జీవనం
ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కొన్ని దశాబ్దాలు పని చేసిన భాట్టం ఏనాడూ అధికార దర్పం, డాబు, హంగు ఆర్భాటాలకు పోలేదు. విశాఖ నగరంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న పురాతన ఇంట్లోనే జీవిత చరమాంకం వరకు గడిపారు. అప్పట్లోనే సత్యవతిని కులాంతర వివాహం చేసుకుని ఆదర్శప్రాయుడయ్యారు. అప్పట్లో తన పెళ్లికి ఆయన చేసిన ఖర్చు కేవలం 15 రూపాయలే కావడం విశేషం.
కుమారుడు విద్యాసాగర్ వివాహం జరిగినప్పుడు భాట్టం మంత్రిగా ఉన్నారు. కానీ ఆ హోదాను పక్కన పెట్టి సామాన్య గృహస్తు మాదిరిగా అతి నిరాడంబరంగా వివాహం జరిపించారు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకుని అందులోనే కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి వెళ్లారు. పెళ్లికార్డులు కూడా అచ్చు వేయించలేదు.
అధికార పదవులను అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించలేదు. ప్రతిపక్షాలు కూడా శంకించలేని రీతిలో నిష్కల్మషమైన రాజకీయాలు నేర్పిన భాట్టం తన కుమారుడు, ఇద్దరు కుమార్తెలను రాజకీయాలకు దూరంగా ఉంచారు. 2015 జులై ఆరో తేదీన 89 ఏళ్ల వయసులో భాట్టం కన్నుమూసినా.. ఆయన ఆచరించిన సిద్ధాంతాలు సజీవంగానే ఉండి.. ప్రస్తుత రాజకీయ నేతలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.