Idream media
Idream media
దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్ట్, కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ల ధరలలోని వ్యత్యాసంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ధరలలో వ్యత్యాసం ఎందుకంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌పై జాతీయ విధానం ఉండాలని, ధరల నిర్ణయ అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలంటూ పలుమార్లు చెప్పినప్పటికీ నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
మరో వైపు కోవిషీల్ట్, కోవాగ్జిన్ మార్కెట్ ధరల అంశంపై.. కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొవిషీల్ట్ మార్కెట్ ధర 600 రూపాయలు కాగా.. కోవాగ్జిన్ «1200 రూపాయలకు విక్రయిస్తున్నారు. తమ వ్యాక్సిన్ డోసు విలువ వాటర్ బాటిల్ కంటే తక్కువ ఉంటుందని మొదట ప్రకటించిన భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లాపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ధరల వ్యత్యాసం వివాదం వల్ల తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిందేమో గానీ.. భారత్ బయోటెక్ యాజమాన్యం అధిక ధరల అంశం కేంద్ర ప్రభుత్వ మెడకు చుడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు 150 రూపాయలకు చొప్పున విక్రయిస్తుండడంతో తమకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టం భర్తీ చేసుకునేందుకే ప్రైవేటు ధరను 1200 రూపాయలుగా నిర్ణయించామని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ అయిందని, ఇందు కోసం తాము 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టామని ఆ సంస్థ చెబుతోంది. కేంద్రానికి 150, రాష్ట్రానికి 400, ప్రైవేటుకు 1200 రూపాయల చొప్పన విక్రయిస్తున్నా.. తమకు సరాసరి డోసుకు 250 రూపాయలే వస్తున్నాయని, ఇది తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావడంలేదంటూ ఆ సంస్థ చెప్పుకొస్తోంది.
ప్రస్తుతం కోవిషీల్ట్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు 90 శాతం కేంద్ర ప్రభుత్వానికి, 10 శాతం ప్రైవేటుగా ఆయా సంస్థలు విక్రయిస్తున్నాయి. అయితే కేంద్రానికి 150 రూపాయల చొప్పన విక్రయించడం వల్ల తమకు నష్టం వస్తుందని తాజాగా పేర్కొన్న కోవాగ్జిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ సంస్థ.. ఇకపై ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటుకు, 75 శాతం కేంద్ర ప్రభుత్వానికి విక్రయించబోతున్నట్లు ప్రకటించింది. ఉచితంగా ఇవ్వాల్సిన వారికి ప్రభుత్వాలు ఇస్తాయని, కొనుగోలు చేయగలిగిన వారే ప్రైవేటులో వ్యాక్సిన్ వేయించుకుంటారంటూ కూడా సదరు సంస్థ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో విక్రయించుకునేలా నిర్ణయం తీసుకోవడం, మార్కెట్ ధర ఎక్కువగా ఉండడానికి కేంద్రమే కారణమని భారత్ బయోటెక్ చెప్పడంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read : ఇంతకు మించిన అభిమానం ఉంటుందా..?