iDreamPost
android-app
ios-app

పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్

  • Published Jan 18, 2022 | 10:01 AM Updated Updated Jan 18, 2022 | 10:01 AM
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్

ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) రాజకీయాల్లో మరో కొత్త ట్రెండ్ సృష్టించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో నిర్ణయించే అధికారాన్ని ప్రజలకే ఇచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ ను సీఎం అభ్యర్థిగా అత్యధిక శాతం ప్రజలు సూచించారని.. ఆ మేరకు ఆయన పేరును ప్రకటిస్తున్నట్లు ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మొహాలీలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.

మాన్ కు 93 శాతం మద్దతు

సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రజలతో ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రులను సొంతంగా ఎంపిక చేసుకుంటాయి. దానికి భిన్నంగా ‘మీ ముఖ్యమంత్రిని మీరే నిర్ణయించండి’ అన్న నినాదంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ ఇచ్చి.. పేర్లు సూచించమని కోరారు. అలాగ్ టెలి సర్వే ద్వారా కూడా అభిప్రాయాలు సేకరించారు. ఈ నెల 13 నుంచి 17 వరకు జరిపిన ఆ ప్రక్రియలో సుమారు 21 లక్షల మంది సూచనలు అందించారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. వారిలో 93.3 శాతం మంది భగవంత్ సింగ్ మాన్ పేరునే సూచించారు. 3.6 శాతం మంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ పేరును, మరికొందరు కేజ్రీవాల్ పేరును కూడా సూచించారు. అయితే వాటిని ఇన్వాలిడ్ గా పరిగణించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తారా?

సీఎం అభ్యర్థిగా ఎంపికైన భగవంత్ మాన్ సాంగ్రూర్ పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. 2014లోనూ ఆయన ఇదే స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2012లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆ ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ తరఫున లెహరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014 మార్చిలో ఆప్ లో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గంలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ పై పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆప్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వృత్తిపరంగా హాస్యనటుడు అయిన మాన్ సీఎం అభ్యర్థిగా ఎంపికైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మాన్ పోటీ చేయాలంటే ఏదో ఒక నియోజకవర్గం అభ్యర్థిని మార్చాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రస్తుతం పోటీ చేయకుండా పార్టీ అధికారంలోకి వస్తే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ హోదాలో ఆరునెలల్లోపు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యే వెసులుబాటు కూడా ఉంది.

Also Read : నితీష్ ,హద్దు దాటొద్దంటున్న బీజేపీ