Idream media
Idream media
జూన్ 25 తేదీ భారత దేశ క్రికెట్ చరిత్రలో రెండు మరచిపోలేని ఘట్టాలు జరిగిన తేదీ. ఒకటి 1932లో జరిగితే మరొకటి 1983లో జరిగింది.
1932 – మొదటి అధికారిక టెస్టు మ్యాచ్
ఇంగ్లీషు వారు తమతో బాటు క్రికెట్ క్రీడను కూడా భారతదేశానికి తీసుకొచ్చారు. 1848లో బొంబాయిలోని పార్శీలు ఒక క్రికెట్ క్లబ్ మొదలుపెట్టి క్రికెట్ ఆడసాగారు. ఆ తర్వాత వీరితో హిందువులు, ముస్లింలు, యూరోపియన్, సిక్కులు వేర్వేరు జట్లగా ఏర్పడి ప్రతి ఏటా ఆడేలా ఒక టోర్నమెంట్ మొదలుపెట్టారు. అప్పుడే రంజిత్ సింగ్జీ, దులీప్ సింగ్జీ ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి జట్లకు ఎంపికై తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
1911లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండులో పర్యటించి అక్కడి కౌంటీలతో, క్రికెట్ క్లబ్బులతో కొన్ని మ్యాచ్లు ఆడింది కానీ, టెస్టు హోదా లేకపోవడం వల్ల ఇంగ్లాండ్ జాతీయ జట్టుతో మ్యాచ్ ఆడలేదు. భారత జట్టుకి టెస్టు హోదా 1926లోనే వచ్చినప్పటికీ తొలి టెస్టు ఆడటానికి 1932 వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ జట్టు ఆహ్వానం మేరకు 1932లో ఆ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్ళింది భారత జట్టు.
ఈ పర్యటనలో ఒక టెస్టు మ్యాచ్, 26 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన భారత జట్టు టెస్టు మ్యాచ్ ఓడిపోయింది. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో తొమ్మిది గెలిచి, మరో తొమ్మిది డ్రాగా ముగించి, ఎనిమిది ఓడిపోయింది. జట్టు ఎంపికలో చాలా జాగ్రత్త వహించిన సెలక్టర్లు ఏడు మంది హిందువులు, నలుగురు మహమ్మదీయులు, నలుగురు పార్శీలు, ఇద్దరు సిక్కులతో మత సమతుల్యం పాటించారు. అయితే అప్పట్లో బాగా టాలెంటెడ్ బ్యాట్సుమన్ అని పేరున్న విజయ్ మర్చెంట్ మహాత్మాగాంధీకి సంఘీభావంగా జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు పోవడానికి నిరాకరించడంతో ఆఖరి నిమిషంలో అతని స్థానంలో వేరొకరిని పంపించారు.
ఈ పర్యటనకు ఆర్థిక సహాయం చేసిన పోరుబందర్ మహారాజాను జట్టు కెప్టెన్ గా నియమించారు. అయితే రాజావారు మొదట్లో కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడి, టెస్టు మ్యాచ్ జట్టులో స్థానం కూడా వద్దని స్వచ్ఛందంగా తిప్పుకొని సి. కె. నాయుడుని కెప్టెన్ గా నియమించారు.
జూన్ 25న ప్రారంభమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ గా డగ్లస్ జార్డిన్ వ్యవహరించాడు. ఇతనే ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మీద బాడీలైన్ బౌలింగ్ ప్రయోగించి అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. నాలుగు రోజుల్లో ముగిసిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 158 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ మహ్మద్ నిస్సార్ అయిదు వికెట్లు తీసుకోవడం, భారతజట్టు రెండో ఇన్నింగ్స్ లో అమర్ సింగ్ అర్ధ సెంచరీ సాధించడం భారత జట్టుకు చెప్పుకోదగ్గ విషయాలు.
భారత జట్టు తన మొదటి టెస్టు విజయం సాధించడానికి రెండు దశాబ్ధాలు పట్టింది. తన ఇరవై నాలుగవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు మీద 1952లో మద్రాసులో జరిగిన మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఈ మైలురాయి చేరుకుంది. ఆ సంవత్సరమే పాకిస్తాన్ మీద తన మొదటి సిరీస్ విజయం కూడా నమోదు చేసింది.
1983 – మొదటి ప్రపంచ కప్
1983లో జరిగిన మూడవ ప్రుడెన్షియల్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న భారత జట్టు మీద అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. అంతకుముందు జరిగిన రెండు ప్రపంచ కప్ పోటీల్లో పేలవమైన ప్రదర్శన ఇవ్వడం, జట్టులో ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోవడం, ఫేవరేట్ జట్లు వెస్టిండీస్, ఆస్ట్రేలియాలు కూడా భారత జట్టుతో కలిసి ఒకే గ్రూపులో ఉండడం ఇందుకు కారణాలు.
గ్రూపు స్థాయిలో మొదటి మ్యాచ్ లో క్రికెట్ పసికూన జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించి సంచలనం నమోదు చేస్తే, అదేరోజు జరిగిన మరో మ్యాచ్ లో వెస్టిండీస్ మీద గెలిచి భారత జట్టు మరో సంచలనం నమోదు చేసి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచిలో ఓటమి దిశగా ఉన్న భారత జట్టుని కెప్టెన్ కపిల్ దేవ్ ఒంటిచేత్తో 175 పరుగులు సాధించి గెలిపించి కప్పు గెలిచే సత్తా ఉందన్న నమ్మకాన్ని సహచరుల్లో నింపాడు.
పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు ఆ పోటీలో మరో పేవరైట్ ఇంగ్లాండ్ మీద విజయం సాధించి, ఫైనల్లో వెస్టిండీస్ తో పోటీకి సిద్దమైంది.
జూన్ 25 తేదీన లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 183 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో భారత వీరాభిమానులు కూడా మ్యాచ్ మీద ఆశలు వదులుకున్నారు. మేటి బ్యాట్స్ మెన్ తో నిండి ఉన్న వెస్టిండీస్ జట్టులో ఏ ఇద్దరు ఆటగాళ్లు నిలబడినా ఛేధింఛగల చిన్న లక్ష్యం అది. అయితే కట్టుదిట్టమైన ఫీల్డింగ్, క్రమశిక్షణతో చేసిన బౌలింగ్ తో వెస్టిండీస్ జట్టు లక్ష్య ఛేధనలో తడబడింది. మొహిందర్ అమర్ నాధ్, మదన్ లాల్ వేసిన మీడియం పేస్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడ్డ విండీస్ ఆటగాళ్లు చెరో మూడు వికెట్లు సమర్పించుకున్నారు. ఎంత పెద్ద స్కోరు అయినా ఒంటిచేత్తో సాధించగల ఆటగాడు వివియన్ రిచర్డ్స్ గాల్లోకి లేపిన బంతిని, కపిల్ దేవ్ వెనక్కి పరిగెత్తి పట్టిన అద్భుతమైన క్యాచ్ తో వెస్టిండీస్ పరాజయం ఖాయమైంది.
తదనంతర పరిణామాలు
ప్రపంచ కప్ ఓటమిని వెస్టిండీస్ తేలిగ్గా జీర్ణించుకోలేకపోయింది. అదే సంవత్సరం భారత పర్యటనకు వచ్చిన ఆ జట్టు ఆ సిరీస్ ని రివెంజ్ సిరీస్ గా ఆడింది. అయదు టెస్టు మ్యాచ్ లకు గానూ మూడు గెలిచి, రెండు డ్రా చేసి, ఆరు వన్డేలలో ఆరింటినీ గెలిచింది. అయితే ఈ సిరీస్ లో ఒక ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు తీసి కపిల్ దేవ్, మరొక ఇన్నింగ్స్ లో 236 పరుగులు చేసి సునీల్ గవాస్కర్ తమ వ్యక్తిగత రికార్డులు నమోదు చేశారు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఈ జట్టులో ఉన్న హేమాహేమీలు రిటైర్ అవడం, కొత్తగా వచ్చిన ఆటగాళ్లు అంతటి ప్రతిభ చూపించలేకపోవడంతో వెస్టిండీస్ జట్టు ప్రతిభ క్రమేపీ దిగజారుతూ వచ్చి, అనామక జట్ల చేతిలో కూడా పరాజయం పొందే స్థాయికి దిగిపోయింది.
ప్రపంచ కప్ విజయంతో క్రీడాభిమానుల హృదయాల్లో అప్పటివరకూ ఉన్న హాకీ స్థానాన్ని క్రికెట్ ఆక్రమించింది. అదే సమయంలో అంతర్జాతీయంగా పచ్చిగడ్డి మైదానాలలో హాకీ ఆడడం మానివేసి, ఆస్ట్రో టర్ఫ్ రావడంతో హాకీ ఆటలో నైపుణ్యం కన్నా వేగం, పవర్ ముఖ్యం కావడంతో యూరోపియన్, ఆస్ట్రేలియన్ ఆటగాళ్లతో పోటీ పడలేక హాకీలో భారత్ దిగజారిపోవడంతో అభిమానుల గుండెల్లో క్రికెట్ అంటే ఇష్టం మొదలై అది పిచ్చిగా మారింది.