విజయవాడ బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి చాలాకాలంగా పలు ప్రతిపాదనలు వచ్చాయి. కానీ పనులు మాత్రం సాగలేదు. ఎట్టకేలకు 2013లో శంకుస్థాపన చేసి తొలి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ అవి నత్తనడకన సాగాయి. చివరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కూడా ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్ హెచ్ ఏ ఐ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓవైపు విజయవాడను రాజధాని నగరం అని పేర్కొంటూనే రెండు ఫ్లై ఓవర్ల విషయంలో నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓవైపు కనకదుర్గ ఫ్లై ఓవర్, రెండో వైపు బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ కూడా అదే రీతిలో అసంపూర్తిగా మిగిలిపోయాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాలు ఫలించి ఇప్పటికే రెండు ఫ్లై ఓవర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రాకపోకలూ సాగుతున్నాయి. కొంత వరకూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దోహపడుతున్నాయి. అయితే బెంజి సర్కిల్ లో రెండో ఫ్లై ఓవర్ కూడా అందుబాటులోకి వస్తేనే అసలు సమస్య పరిష్కారమవుతుందని స్పష్టమవుతోంది. దాంతో రెండో ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం చొరవగా కదిలింది. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించింది. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా సహకరిస్తూ పనుల్లో పురోగతిని ప్రదర్శిస్తోంది.
గతంలో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ క్రెడిట్ మాదేనని చెప్పుకున్న టీడీపీ నేతలు బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో జరిగిన జాప్యం మాత్రం తమకు బాధ్యత లేదని చెప్పుకోవడం రెండు కళ్ల సిద్ధాంతానికి మరో ఉదాహరణగా మిగులుతోంది. విజయవాడలో రెండు ఫ్లై ఓవర్లను కూడా జగన్ హయంలోనే ప్రారంభించగా, ఇప్పుడు బెంజి సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ కూడా నిర్మాణ పనులు పూర్తి చేసుకునే దశలో ఉంది. నవంబర్ నెలాఖరుకి పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా కొత్త ఫ్లై ఓవర్ సిద్ధమయితే బెజవాడ వాసుల ట్రాఫిక్ బాధలు చాలావరకూ తీరినట్టే అవుతుంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చోట చాటుతున్నట్టుగా నాడు- నేడు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు హయంలో అత్యంత అలసత్వం ఆయా ఫ్లై ఓవర్ల నిర్మాణంలో కనిపించగా, జగన్ పాలనలో పనులు వేగవంతంగా ముందుకు సాగడం ప్రజలంతా గమనిస్తున్నారు.