iDreamPost
android-app
ios-app

బెంగాల్, అసోంలో పోలింగ్ తోలి దశలో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికీ కలిసొస్తుంది?

  • Published Mar 28, 2021 | 4:51 AM Updated Updated Mar 28, 2021 | 4:51 AM
బెంగాల్, అసోంలో పోలింగ్ తోలి దశలో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికీ కలిసొస్తుంది?

బెంగాల్ , అసోంలో తొలి దశ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించారు. అయితే అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా బెంగాల్ లో రాజకీయంగా గట్టి పోటీ ఉండడంతో టీఎంసీ, బీజేపీతో పాటు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి మధ్య కొన్ని చోట్ల ఘర్షణ లు జరిగతాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తొలి దశ ఎన్నికలు జరిగాయి. తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో ప్రతీసారి తీవ్రమైన హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటాయి.

ఈసారి కూడా పోలింగ్ రోజు తెల్లవారుజామునే భగవాన్పూర్ నియోజకవర్గంలో కాల్పులతో కలకలం రేగింది. ఆ తర్వాత బూత్ ఆక్రమణలు, ఏజెంట్లపై దాడులు వంటివి పలు చోట్ల జరిగాయి. కొన్ని చోట్ల టీఎంసీకి వేసిన ఓట్లు కూడా ఈవీఎంలో బీజేపీకి పడుతున్నాయంటూ తృణమూల్ శ్రేణులు నిరసనలకు దిగాయి. దాంతో కొంతసేపు పోలింగ్ కి ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి. వీవీ పాట్ స్లిప్పుల విషయంలో గందరగోళం కూడా ఏర్పడింది. చివరకు పోలీసుల జోక్యంతో పోలింగ్ ముగిసింది. తూర్పు మిడ్నాపూర్ లో అత్యధికంగా 82.5 శాతం పోలింగ్ జరిగింది. బెంగాల్ లో 80 శాతం దాటడం చర్చనీయాంశం అయ్యింది. ఇక అసోంలో మాత్రం 77 శాతం పోలింగ్ జరిగింది.

ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ శాతం పెరగడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. రెండు చోట్ల గట్టి పోటీ ఉంది. అధికార పార్టీలు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి. బెంగాల్ లో మమత హ్యాట్రిక్ కొట్టకుండా అడ్డుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎలా అయినా ఈసారి పగ్గాలు దక్కించుకోవాలని దీదీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాంతో పాటుగా ఒకనాటి తమ కంచుకోటలో ఉనికి చాటుకునే యత్నంలో కామ్రేడ్లు, కాంగ్రెస్ ఉన్నాయి. దాంతో పోటీ తీవ్రంగా ఉంది.

కమ్యూనిస్టు-కాంగ్రెస్ కూటమికి ఓట్ల శాతం పెరిగితే అది బీజేపీ బలం మీద ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ కూటమి సభలకు భారీగా జనం తరలివచ్చారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక మీద బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. అదే సమయంలో మమత సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్న తరుణంలో ప్రజలు ఎలా స్పందిస్తారోననే చర్చ సాగుతోంది.

ఇక అసోంలో కూడా అదికారం నిలబెట్టుకోవాలనే బీజేపీ యత్నాలకు ఈసారి ఎదురుదాడి తీవ్రంగానే ఉంది. ఒంటరిగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నప్పటికీ కూటమి బలంతో కదనకుతూహలం ప్రదర్శిస్తోంది. ప్రియాంక గాంధీ కూడా ఇక్కడే పాగా వేశారు. ఈసారి తేయాకు తోటల్లో కమలం వికసించకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో వివిధ పార్టీల మద్ధతు మూలంగా తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈసారి తమ బలం పెరిగిందని విశ్వసిస్తోంది. సీఏఏ, ఎన్నార్సీ మూలంగా ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించగలమని ఆశిస్తోంది. దాంతో అసోం ఫలితాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి. ఈ తరుణంలో తొలిదశ పోలింగ్ లో ఓటర్లు గతం కన్నా ఎక్కువ మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం రాజకీయంగా ఎవరికి మేలు చేస్తుందోననే చర్చ మొదలయ్యింది.