iDreamPost
iDreamPost
కేంద్రంలో వరుసగా రెండోసారి విజయం సాధించిన తర్వాత బీజేపీ కన్ను బెంగాల్ పై పడింది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన నేపథ్యంలో వాటికి ముఖద్వారంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ని కైవసం చేసుకోవాలని కాచుకుని కూర్చుంది. దానికి తగ్గట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లో లభించిన సానుకూల ఫలితాలను సొమ్ము చేసుకోవాలని చూసింది. టీఎంసీ నుంచి వలసలను ప్రోత్సహించి బలపడాలని ఆశించింది. శారదా, నారదా కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతలను ఇరకాటంలో నెట్టి ఫిరాయింపులు ప్రోత్సహించింది.
అయినా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి చాలా దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. మమతా దూకుడుతో కమలం కలలు చెల్లాచెదురయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మళ్లీ రివర్స్ మైగ్రేషన్ మొదలయ్యింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్ వంటి వారు కూడా జంప్ అయిపోయారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి , ఎంపీ బబుల్ సుప్రియో పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాంతో బెంగాల్ బీజేపీలో ఏం జరుగుతందోననే చర్చ మొదలయ్యింది.
బబుల్ సుప్రియో వరుసగా రెండుసార్లు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. దానికి ముందు మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన అసాన్ సోల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత మోడీ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. పర్యావరణం, అటవీ , వాతావరణ మార్పుల శాఖకి సహాయమంత్రిగా పనిచేసిన బబుల్ ని ఇటీవల క్యాబినెట్ నుంచి తొలగించారు. దానికి ముందు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పట్ల అమిత్ షా వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయ్యింది. బహిరంగసభ వేదికగానే ఆయన్ని ఖాతరు చేయని వైనం ఆసక్తిరేపింది.
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన బబూల్ ఓటమి పాలయ్యారు. టోలీగంజ్ నియోజకవర్గంలో బరిలో దిగి 50వేల పైబడిన తేడాతో పరాజయం పొందారు. దాంతో ఆయన రాజకీయంగా తీవ్ర సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉండడంతో ఆఖరికి రెండు రోజుల క్రితం తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు అనూహ్య ప్రకటన చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదిస్తారా లేదా అన్నది పక్కన పెడితే బీజేపీ నేతల వైఖరితో తీవ్రంగా మనస్తాపం చెందిన అసాన్ సోల్ ఎంపీ అనూహ్యంగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు చేసిన ప్రకటన బెంగాల్ బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. బీజేపీలో వర్గపోరుకి ఇది తార్కాణంగా చెబుతున్నారు. టీఎంసీ నుంచి వచ్చిన సుబెందో అధికారికి ప్రాధాన్యతనిచ్చి చాలాకాలంగా బీజేపీలో ఉన్న నేతలను విస్మరిస్తున్నారని ఓ వర్గం వాపోతోంది. వారంతా బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారనే ప్రచారం ఉంది.
ఇప్పటికే బబుల సుప్రియో రాజీనామా నేపథ్యంలో ఆయన త్వరలో మళ్లీ టీఎంసీ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అనుచరులు చెబుతున్నారు. ముకుల్ రాయ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న బబుల్ కి ఇంకా భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. బాలీవుడ్ సింగర్ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఎదిగిన సుప్రియో త్వరలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరం. ప్రస్తుతం ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేసేందుకు బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. మెత్తపడతారో లేదో చూడాలి.