iDreamPost
android-app
ios-app

Mallem konda – బద్వేలు కాశ్మీరం – మల్లెం కొండ ⛰️🏞️⛰️

Mallem konda – బద్వేలు కాశ్మీరం – మల్లెం కొండ  ⛰️🏞️⛰️

పోలికలో కొంచెం అతిశయం ఉండొచ్చేమో గానీ పచ్చటి అడవికి శ్వేత వర్ణ మేఘాలు నల్లటి దుప్పటి కప్పగా ఆ దుప్పటి నుంచి చాటుగా తలలు బయటికి పెట్టి నవ్వుతూ పలకరించే చెట్లను, లోయల మీదుగా రివ్వున వీస్తూ ఆ లాలనలో సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నాయా అన్నట్టు మైమరిపించే కొండ గాలులను, మా సంగీత ఝరిని విని తరించమంటూ గల గల దూకుతూ ప్రకృతి సంగీతాన్ని ఆలపించే అజ్ఞాత జలపాతపు సవ్వడులను, వీటన్నింటితో పాటు ఆ నిశ్శబ్ధ క్షణాన స్వచ్ఛమైన వినీలాకాశపు నిర్మలత్వాన్ని చూశాక మల్లెం కొండ అనుభూతులు ఆ కాశ్మీర్ అందాలకు ఏ మాత్రం తీసిపోవు అనిపించింది.

నాయిని క్రిష్ణకుమారి గారు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ‘కాశ్మీర దర్శనం’ లో రాసుకున్న అనుభవాలు, అనుభూతులు, ఆనందాలు ఇక్కడే స్థానికంగా కడప జిల్లాలోని బద్వేల్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో మీ స్వంతం అవుతాయి. అదీ వర్షాకాలం లేదా చలికాలం అయితే జీవిత కాలం గుర్తిండిపోయే జ్ఞాపకాలు మీ స్వంతమవుతాయి.

మేం అక్కడికి చేరుకునే సరికి తొమ్మిదిన్నర కావొస్తోంది. అయినా కూడా మంచు దుప్పటి కప్పుకుని అప్పుడే వచ్చారా అన్నట్టు మత్తుగా జోగుతున్నాయి కొండలన్నీ. ఈ మధ్య కురిసిన వర్షాలకు అడవంతా పచ్చగా మెరిసిపోతోంది. దారిలో అక్కడక్కడా మట్టి మొత్తం కొట్టుకుపోయింది. వాగులు, వంకలు రాళ్లు తేలి ఉన్నాయి.

ఒకపక్క ఆఫీసుకు టైం అవుతున్నా సరే అక్కడివరకే కదా వెళ్లొద్దాం పద అని దిగువ మల్లెం కొండ వద్దకు వెళ్లగానే అక్కడ నుండి నిండు తూర్పుగా పెద్ద పెద్ద రాళ్లు రా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్నాయి. మల్లెం కొండకు చాలా సార్లు వచ్చాం గానీ అక్కడికి ఎప్పుడూ వెళ్లింది లేదు.

‘చేరాల్సిన గమ్యం స్పష్టమైనప్పుడు నడవాల్సిన దారి పెద్దగా ఆటంకం కాదు’ అన్నట్టు మూడొందల మీటర్ల వరకూ మల్లెం కొండ సప్పట దారి మీదుగా వెళ్లి అక్కడి నుంచి నీళ్లు జారిన జాడల వెంబడి ఎడమ వైపు కొండ మీదికి సాగిపొయ్యాం. తొలుత కొద్దిసేపు పెద్దగా ఇబ్బంది లేదు గానీ ఆ తర్వాత జాడలు మారిపొయ్యాయి. అటు నుంచి అటే ఒక బోడు దాటి దూరంగా కనపడే రాళ్లవైపు సాగిపోతుంటే అప్పుడు మొదలయ్యింది పరికె కంపతో పోరాటం.

‘పరికతో పరాచికాలు కాదు’ అన్న నానుడిని నిజం చేస్తూ ఎక్కడికక్కడ మమ్మల్ని పరిక్షించసాగింది. దాన్నుండివీలైనంత వరకూ తప్పించుకుంటూ దొరికిన చోట విడిపించుకుంటూ అక్కడికి చేరి ఒక్కసారి పైన్నుంచి కిందికి చూడగానే అప్పటి వరకూ అనుభవించిన శ్రమ, పరిక కంప తాలూకు చిరాకులన్నీ ఆ కొండ గాలిలో కలిసిపోయాయి.

ఆకుపచ్చని చీరకట్టుకున్న నీలి రంగు కొండలకు రుధిర వర్ణపు కొండ పేటులు బొట్టుపెట్టగా శిఖరం అంచు మీదుగా దట్టంగా అలుముకున్న మంచు వెండి కిరీటాన్ని అలంకరించి ఇప్పుడు చూడు మా అందాలను అన్నట్టు ఊరించాయి. వాటికి తోడు వర్షించాలా వద్దా అన్నట్టు ఆగి ఆగి పడే తుంపర్లు మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి.

ఈ ప్రకృతి మైమరపులో ఆరోగ్యం బాగాలేదు అనే సాకుతో ఆఫీసుకు సెలవు పెట్టక తప్పింది కాదు. ప్రకృతి చేసే మాయ అంటే అదేనేమో..! ఇక్కడే ఇలా ఉంటే ఇంక మల్లెం కొండ దగ్గర ఎలా ఉంటుందో అంటూ మొదలైన ఆతృతని సమయాభావం అతి బలవంతంగా ఆపింది లేకుంటే ఇంకో రోజు కూడా సెలవు పెట్టాల్సి ఉండేది.

నాకు అనిపించినట్టు మీకూ అనిపించాలని లేదు గానీ కొంచెం ఉత్సాహం, కొంచెం శ్రమ, మరికొంత సమయం కేటాయించగలిగితే మల్లెం కొండ మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచదు.