iDreamPost
android-app
ios-app

భారత పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ నెట్ ప్రాక్టీస్‌పై ఆగ్రహం వెలిబుచ్చిన బీసీసీఐ

భారత పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ నెట్ ప్రాక్టీస్‌పై ఆగ్రహం వెలిబుచ్చిన బీసీసీఐ

భారత పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ శనివారం ప్రారంభించిన నెట్ ప్రాక్టీస్‌పై ఆగ్రహం వెలిబుచ్చిన బీసీసీఐ

టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది తమ అనుమతి లేకుండా శార్దూల్ స్వతహాగా ఔట్‌డోర్‌లో ప్రాక్టీస్ చేయడం సరికాదని అభిప్రాయపడింది.ఇక కరోనా వైరస్ కట్టడిలో భాగంగా గత మార్చి 22వ తేదీ నుండి దేశంలో లాక్‌డౌన్ విధించడంతో క్రికెటర్లు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17న దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్‌‌ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్,ఆరెంజ్ జోన్‌‌లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది.కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్, ఆరెంజ్ జోన్‌‌లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, క్రికెట్ స్టేడియాలు తెరిచేందుకు అనుమతులు మంజూరు చేసింది.

దీంతో రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శార్దూల్ ఔట్‌డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. పాల్గర్ జిల్లా బోయిసర్‌లోని తాలుకా స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లోని నెట్స్‌లో డొమెస్టిక్ ప్లేయర్‌లతో కలిసి నెట్స్‌లో శార్దూల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న శార్దూల్ బోర్డు అనుమతి లేకుండానే ప్రాక్టీస్ మొదలు పెట్టడంపై బీసీసీఐ అధికారి అసంతృప్తిని వెలుబుచ్చాడు. పైగా శార్దూల్ ఇలా చెయ్యడం తెలివైన పని కాదు,ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

అయితే ప్రాక్టీస్ సెషన్‌లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరాన్ని పాటించినట్లు ఠాకూర్ తెలిపాడు. బంతి స్వింగ్ కోసం ఉమ్మిని కూడా వాడ లేదని అతను ప్రకటించాడు.ఇంకా శార్ధూల్ ఠాకూర్ మాట్లాడుతూ “లాక్‌డౌన్‌ కాలంలో ఇంటి దగ్గర టీమిండియా ట్రైనర్ సూచనల మేరకు ఉన్న నేను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి కాపాడుకున్నాను. చాలా రోజుల తర్వాత నెట్ ప్రాక్టీస్‌లో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాను.ఈ రోజు జరిగిన ప్రాక్టీస్ సెషన్ పట్ల సంతోషంగా ఉన్నాను.కానీ బౌలింగ్‌ రిథమ్ రావాలంటే కొంత టైమ్ పడుతుందని” పేర్కొన్నాడు.