iDreamPost
android-app
ios-app

ఐపీఎల్ వేదిక ఖరారుపై అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ

ఐపీఎల్ వేదిక ఖరారుపై అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ

ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ వాయిదాతో ఐపీఎల్-2020 సీజన్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది.ఈ క్రమంలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు 51 రోజులపాటు 60 ఐపీఎల్ మ్యాచ్‌‌లు జరిగేలా షెడ్యూల్‌ని బీసీసీఐ ప్లాన్ చేసింది. తాజాగా ఐపీఎల్-2020 వేదికగా యూఏఈని ఎంపిక చేస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటనని విడుదల చేసింది.

వాస్తవానికి రెండు నెలల క్రితమే ఐపీఎల్-2020 సీజన్‌కి తాము ఆతిథ్యమిస్తామని యూఏఈ‌, దక్షిణాఫ్రికా బీసీసీఐకి ప్రతిపాదించాయి. కానీ సెప్టెంబరు నాటికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని భావించిన బీసీసీఐ వీరి ఆహ్వానాలపై అప్పట్లో స్పందించలేదు. కానీ తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌‌లు జరిగే ముంబై,చెన్నై,ఢిల్లీ, బెంగళూర్, హైదరాబాద్ వంటి మహానగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతోంది.ఈ నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించడం కష్టమని బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చేసింది. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకి ఐపీఎల్ పాలకమండలి ఆమోదం తెలిపింది.ఈ మేరకు ఇవాళ బీసీసీఐ ఓ లేఖని ఈసీబీకి పంపినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించాడు.

ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటి వరకు 12 సీజన్‌లను పూర్తి చేసుకుంది.అయితే 2009 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ రెండో సీజన్‌ని బీసీసీఐ దక్షిణాఫ్రికాలో నిర్వహించింది. అలాగే 2014 జనరల్ ఎలక్షన్ సమయంలోను లీగ్ దశ మ్యాచ్‌‌లకి యూఏఈ ఆతిథ్యాన్ని బీసీసీఐ స్వీకరించింది. భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌ల్ని నిర్వహించిన రెండు సందర్భాలకి కారణం సార్వత్రిక ఎన్నికలు. కాగా ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకిగా మారడం గమనార్హం.

ఇప్పటికే ప్రతిపాదిత షెడ్యూల్‌ని ఫ్రాంఛైజీలకి అందించిన బీసీసీఐ ఓ నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలని సూచించినట్లు తెలుస్తోంది.అయితే ఐపీఎల్-2020 సీజన్ నిర్వహణకు కేంద్రం ఇంకా పచ్చజెండా ఊపు లేదు.