ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్ చట్ట సభల్లోనూ ఆ మేరకు తన కృషిని కొనసాగిస్తోంది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యం లో నిన్న ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన ఢిల్లీ లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఇందులో చట్ట సభల్లో బిసి, మహిళా రిజర్వేషన్ల అమలు పై వైఎస్సార్ సిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు మాట్లాడారు.
విద్యా ఉద్యోగాల్లో బిసిలకు, మహిళలకు రిజర్వేష్లలు ఉన్నాయి. చట్ట సభల్లో కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కొన్నేళ్ళుగా ఉంది. గడచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సిపి సర్కార్.. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళల సామజిక, రాజకీయ, ఆర్ధిక అభివృద్ధి కోసం అనేక చట్టాలు చేసింది. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీ లో చట్టం చేసింది. మొత్తం పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కూడా 60 శాతం మంత్రి పదవులు.. బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు.