iDreamPost
iDreamPost
ఏపీలో బీసీలు జనాభా రీత్యా అత్యధికులు. కానీ ప్రాధాన్యత రీత్యా అట్టడుగున ఉంటారనేది ఆ వర్గీయులలో గూడుకట్టుకున్న భావన. గతంలో బీసీలే తమకు బలమని చెప్పుకున్న టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరించడమే దానికి ప్రధాన కారణం. బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలకు రాజకీయ ప్రాధాన్యత విషయంలోనూ, నిధుల కేటాయింపు విషయంలో చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూసింది. కేవలం ప్రకటనలే తప్ప చేతల్లో ఆదరణ లేకపోవడంతో ఆ వర్గీయులు నిరాశలో మునిగారు. ఇలాంటి సమయంలో తాము అధికారంలోకి వస్తే బీసీలలో అన్ని ప్రధాన కులాలకు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాట్లు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటించిన దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. బీసీలలో 30వేల మంది పైబడి జనాభా ఉన్న వారందరికీ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. బీసీల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ మించి బీసీ వర్గాల ప్రయోజనాల రీత్యా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా మత్స్యకారుల కోసం జెట్టీల నిర్మాణం సహా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి. వాటికి తోడుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకార, శెట్టిబలిజ సామాజికవర్గాలకు చెందిన నేతలను తొలిసారి పార్లమెంట్ ఎగువ సభలో అవకాశం కల్పించారు. క్యాబినెట్ లో కూడా బీసీలకు 5 బెర్తులు కేటాయించారు. ఇలా రాజకీయంగానూ, పథకాల రంగానూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా బీసీ కార్పోరేషన్ల పాలకవర్గాలను ప్రకటించానికి సమాయత్తమయ్యింది.
కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వాటికి పాలకవర్గాలను ఖరారు చేశారు. నేడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించబోతోంది. వివిద కులాల వారీగా బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను ప్రకటించారు. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మరో కీలకాంశం. ఈ పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కబోతున్నాయి. పురుషులు కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌పదవులు దక్కుతుండడం మరో చారిత్రాకాంశంగా చెప్పవచ్చు. మొత్తం 56 చైర్మన్ పోస్టుల్లో 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్ పదువులు దక్కబోతున్నాయి. ఇక 728 డైరెక్టర్ల పదవుల్లో 364 డైరెక్టర్లు గా మహిళలకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా కసరత్తులు చేసి ఈ జాబితా సిద్ధం చేశారు. దాంతో ఈ పదవులు ద్వారా వైఎస్సార్సీపీలో పనిచేస్తున్న వివిధ కులాల నేతలకు నామినేటెడ్ పదవలు లభించబోతున్నట్టు చెప్పవచ్చు.