స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన రుణగ్రహీతలకు కొత్త ఏడాది కానుక ప్రకటించింది. జనవరి 1 నుంచి మార్కెట్ ప్రామాణిక వడ్డీ రేటు (ఈబీఆర్)ను 8.05 శాతం నుంచి 7.80 శాతానికి తగ్గించింది. దీంతో ఎస్‌బీఐ ఈబీఆర్ అనుసంధానిత రుణాలు తీసుకున్న గృహ, ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలకు కొత్త ఏడాది నుంచి వడ్డీ భారం 0.25 శాతం మేర తగ్గనుంది. అలాగే కొత్తగా ఈ రుణాలు పొందే వారు చెల్లించాల్సిన వడ్డీ రేటు 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఎస్‌బీఐ ఈబీఆర్ అనుసంధానిత రుణాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్కెట్ ప్రామాణిక రేట్లలో ఒకటైన ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా ఈ రుణాల వడ్డీ రేటును సవరిస్తుంటుంది. కొత్త విధానంలో బ్యాంకులు ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సవరించేందుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
ఇండియన్ బ్యాంక్ కూడా…
ఎస్‌బీఐతోపాటు ఇండియన్ బ్యాంకు సైతం జనవరి 3 నుంచి నిధుల సేకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 0.05 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ రుణాలపై ఎంసీఎల్‌ఆర్ 7.95 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గింది. నెలకాలపరిమితి రుణాలపై వడ్డీ 8.05 శాతం నుంచి 8 శాతానికి, మూడు నెలల రుణాలపై 8.20 శాతం నుంచి 8.15 శాతానికి, ఆరు నెలల రుణాలపై 8.25 శాతం నుంచి 8.20 శాతానికి, ఏడాది రుణాలపై 8.35 శాతం నుంచి 8.30 శాతానికి తగ్గనుంది.