iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ నడిచిన దారిలో.. బండి సంజయ్ పాదయాత్ర

  • Published Jul 05, 2021 | 1:41 AM Updated Updated Jul 05, 2021 | 1:41 AM
వైఎస్సార్ నడిచిన దారిలో.. బండి సంజయ్ పాదయాత్ర

ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్రల సీజన్ మొదలైంది కదా. ఒక్కొక్కరుగా నేతలు తమ పాదయాత్రల గురించి ప్రకటనలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైఎస్ షర్మిల తదితరులు ఇంకా పాదయాత్రలపై చర్చలు, ఆలోచనల దశలోనే ఉండగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ‘అడుగు’ ముందుకు వేశారు.

మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అంటూ నినదించిన ఆగస్టు 9న పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నడిచిన రూట్లలోనే పాదయాత్ర చేయాలని సంజయ్ నిర్ణయించుకోవడం గమనార్హం. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. వైఎస్ మాదిరే రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో సంజయ్ పాదయాత్ర సాగనుంది. ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ లో ముగియనుంది.

ఎన్నికల వరకు కొనసాగేలా..

రెండున్నరేళ్లలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అప్పటిదాకా తన పాదయాత్ర కొనసాగేలా బండి సంజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సుదీర్ఘంగా యాత్ర కొనసాగించకుండా.. నాలుగైదు విడతల వారీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్కో విడత ముగిశాక, తర్వాత విడతకు 3 నెలల గ్యాప్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 55 రోజులపాటు 750 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. రోజూ 15 నుంచి 20 కిలోమీటర్ల నడిచేలా, స్థానిక ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకునేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.

తొలి విడత.. టార్గెట్ హుజూరాబాద్..

ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ లో ఎలాగైనా గెలిపించాలని కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ తొలి విడత పాదయాత్ర హుజూరాబాద్ దగ్గర ముగుస్తోంది. ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కవర్ చేసేలా తన యాత్రను సంజయ్ ప్లాన్ చేసుకున్నారు. పైగా సెప్టెంబర్, అక్టోబర్ లో ఉప ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉండటంతో.. అక్టోబర్ 2న తన యాత్రను హుజూరాబాద్ లో ముగించనున్నారు. అంటే ఉప ఎన్నిక టార్గెట్ గా తొలి విడత యాత్ర పూర్తి చేసి.. అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం రాష్ట్రాన్ని చుట్టేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.