iDreamPost
iDreamPost
గోదావరి తీరం రాజకీయంగా ఎంతో కీలకమైనది. స్వతంత్ర పోరాటం నుంచి సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేకమంది ఉద్దండులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కార్మిక సంఘం నాయకుడిగా, రాజమండ్రి మునిసిపల్ చైర్మన్ స్థాయి వరకూ ఎదిగిన జీఎస్ బాలాజీదాస్ వారిలో ఒకరు. 1962లో ఆయన ఆనాటి రాజమండ్రికి ప్రధమ పౌరుడిగా వ్యవహరించారు. స్వతంత్ర్యపోరాటంలో జైలు శిక్ష అనుభవించి, ఉద్యమం కోసం జైలు గోడలు దూకిన చరిత్ర ఆయనది. బ్రిటీష్ బెదిరింపులకు నెరవకుండా పోరాడిన నేపథ్యం ఆయనది.
ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నేతగా కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. సీపీఎం ఆవిర్భావం నుంచి కీలకనేతగా ఎదిగారు. సీఐటీయూ సారధిగా వ్యవహరించారు. కేవలం కమ్యూనిస్టు ఉద్యమాలతో పరిమితం కాకుండా, నగరంలోని అన్ని రాజకీయపార్టీలతోనూ సమన్వయం చేసుకుని ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో బాలాజీదాస్ ది ప్రత్యేక పాత్ర. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన రాజమండ్రికి చాలాకాలం పాటు పెద్ద దిక్కుగా వ్యవహరించారు.
ముఖ్యంగా 1980,90 వ దశకాలలో రాజమండ్రి రాజకీయాలు ఆసక్తిగా ఉండేవి. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ అధికారం చేజిక్కించుకున్న సమయంలో జక్కంపూడి రామ్మోహన్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రౌతు సూర్యప్రకాశరావు వంటి వారు యువనేతలుగా నగర రాజకీయాల్లో అప్పుడప్పుడే ఎదిగేవారు. అప్పట్లో నగర కాంగ్రెస్ కి ఏసీవై రెడ్డి నాయకత్వం వహించేవారు. ఆ సమయంలో రాజమండ్రిలో రిక్షా కార్మికుల సమస్యల నుంచి పోలీసుల వేధింపులు, ట్రాఫిక్ సమస్యలు సహా అన్నింటిపైనా ఐక్య ఉద్యమాలు సాగేవి. అప్పటికే జక్కంపూడి వంటి వారు ఐఎన్టీయూసీ నేతలుగా ఉన్నారు. అయినప్పటికీ పేపర్ మిల్లు సహా వివిధ సంస్థల్లో బాలాజీదాస్ నాయకత్వాన ఉమ్మడిగా పోరాడేవారు. కార్మికుల సమస్యలతో పరిమితం కాకుండా పట్టణంలో ప్రతీ సమస్యపైనా అఖిలపక్షం ఆధ్వర్యంలో ముందుకు సాగేవారు.
Also Read: సైకిల్ ఎమ్మెల్యే గురించి తెలుసా!
ఈ అఖిలపక్ష సమావేశాలకు జీఎస్ బాలాజీదాస్ నేతృత్వం వహించారు. జక్కంపూడి తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో రౌతు సూర్యప్రకాశరావు, ఆతర్వాత కందుల దుర్గేష్ వంటి వారు వాటిలో ముఖ్యపాత్ర పోషించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున అశోక్ జైన్ సహా వివిధ ప్రజా సంఘాలు కూడా ఇందులో భాగస్వామిగా ఉండేవి. ఆనాడు అఖిలపక్ష భేటీల మూలంగా అధికారులు, పోలీసులు కూడా ప్రతిపక్షాల వాదనకు ప్రాధాన్యతనివ్వాల్సి వచ్చేది. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సి వచ్చేది. అదే సమయంలో రాజకీయంగానూ అఖిలపక్షం పెద్దలుగా ఉన్న నేతలు పోషించిన పాత్ర నేటికీ నగర వాసులకు గుర్తుకొస్తూ ఉంటుంది.
వివిధ పార్టీల మధ్య కొన్నిసార్లు విబేధాలు వీధిపోరాటాలుగా మారే తరుణంలో వాటిని సముదాయించి, పరిస్థితిని చక్కదిద్దడంలో పెద్దరికం పనిచేసేది. ఆయా పార్టీలలో కూడా వర్గపోరు ఉధృతి ఓ స్థాయిని మించకుండా బాలాజీదాస్ వంటి వారు సర్థిచేసిన చరిత్ర కూడా ఉంది.
బాలాజీదాస్ వయసు, అనుభవం రీత్యానే కాకుండా ఆయన చొరవ కాకుండా రాజమండ్రిలో అనేక సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రయత్నాలు దోహదపడ్డాయి. ఇక టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య కలహాలు హద్దులు మీరకుండా నియంత్రించగలిగాయి. సిటీ బస్సు కార్మికుల పోరాటం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతను తగ్గించి, సమస్యలు తీర్చడానికి ఉపయోగపడ్డాయి. ఒకటేమిటీ రాజమండ్రి రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు అఖిలపక్షం నిర్వహించిన కార్యక్రమాలు బలమైన ముద్ర వేశాయి.
Also Read:మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గుర్తున్నారా ?
అందుకు బాలాజీదాస్ మూలస్తంభం అనడంలో సందేహం లేదు. ఆయన మాటకు గౌరవమిచ్చిన నాయకుల తీరు అందరి మన్ననలు అందుకోవడానికి కారణమయ్యింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం రాజకీయాల్లో యువ నేతలు మధ్య విబేధాలు రోడ్డెక్కిన నేపథ్యంలో అనేకమంది గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాలాజీదాస్ వంటి వారి పెద్దరికం లేని లోటు కనిపిస్తోందని బాధపడుతున్నారు. తొలిసారి చట్టసభలకు ఎన్నికయిన నేతలు నోటికి పనిచెబుతున్న తరుణంలో వారిని వారించే వారే కరువయ్యారని కలత చెందుతున్నారు. ఏమయినా బాలాజీదాస్ మరణించి 20 ఏళ్లు దాటినా నేటికీ రాజమండ్రి వాసులు ఆయన్ని స్మరించుకునే పరిస్థితి కొనసాగడం గమనిస్తే ఆయన ఘనత అర్థమవుతుంది.