iDreamPost
android-app
ios-app

Badvel Bypoll – జగన్ ప్రభుత్వానికి ప్రజల నిర్మాణాత్మక మద్దతు

  • Published Nov 02, 2021 | 4:09 PM Updated Updated Nov 02, 2021 | 4:09 PM
Badvel Bypoll – జగన్ ప్రభుత్వానికి ప్రజల నిర్మాణాత్మక మద్దతు

బద్వేలు ఎన్నికల ఫలితాల విషయంలో ప్రత్యేక ఆసక్తి ఎవరు చూపలేదు. కారణం ఆ నియోజకవర్గ ప్రజలు గతంలో కాంగ్రెస్ పార్టీని , వైసిపి ఏర్పడిన తర్వాత వరుసగా ఆ పార్టీని ఆదరిస్తున్నారు. మరో వైపు విపక్ష తెలుగుదేశం పోటీ నుంచి విరమించినది. సహజంగా ఈ ఎన్నిక లాంఛనప్రాయమే అన్న అభిప్రాయం వ్యక్తం అయినది. కానీ ఎన్నికల తీరును గమనిస్తే అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వానికి ప్రజల నుంచి నిర్మాణాత్మక మద్దతు లభించింది అనక తప్పదు.

బద్వేలు ఎన్నికల పోటీలో ఉన్న బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు చేసిన ఆరోపణలు చూస్తే అసాధారణ అక్రమాలు జరిగినట్లు కనపడలేదు. అధికార పార్టీకి ఉన్న సాదారణ అనుకూల వాతావరణం మాత్రం కనిపించింది. అక్కడి తీర్పును ప్రజల అభిమతముగా పరిగణనలోకి తీసుకోవాలి. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు , రిగ్గింగ్ పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు కూడా రాలేదు. అధికార పార్టీపై గతంలో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులు పై ఒత్తిడి చేసిన ఆరోపణలు బద్వేలు ఎన్నికల సమయంలో రాలేదు కారణం అధికార పార్టీ ప్రధాన దృష్టి ఓటింగ్ శాతం పెంచుకునే విషయం మీద ఉన్నది. తమ ప్రత్యర్ధులు ఎవరు తమకు పోటీ కాదు అన్న ధీమా కూడా మరో ముఖ్యమైన కారణం కావచ్చు.

పేదలలో ఆదరణ సుస్పష్టం.

బద్వేలు ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం. అంటే పేదల ఓట్లు కీలకం. ప్రధాన ప్రత్యర్థి పోటీలో లేకున్నా , డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు లేకున్నా 70 శాతం పోల్ కావడం చిన్న విషయం కాదు అందులో 79 శాతం వైసీపీకి రావడం పేదలలో ప్రభుత్వం పట్ల ఆదరణ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ , కాంగ్రెస్ నేరుగా పోటీలో ఉంటే జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం శ్రేణులు కూడా మద్దతుగా నిలబడ్డారు. అలాంటి ఎన్నికల్లో ప్రజలకు అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటే 79 శాతం ఓట్లు వచ్చేవి కాదు. ముఖ్యంగా కరోనా సమయంలో పేదలు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన నగదుబదిలీ పథకాలు పేదలకు ఉపశమనం కలిగింది. సంక్షేమ పథకాలు తమను కష్ట కాలంలో బయటపడేందుకు దోహదపడ్డాయి అన్న భావన ఏర్పడింది. అందుకే పేదలు ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.