iDreamPost
iDreamPost
రాజకీయ పార్టీ అన్న తర్వాత ఏ ఎన్నికల్లోనయినా స్పష్టత ఉండాలి. తాము ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామన్నది ప్రజలకు చెప్పగలగాలి. కనీసం తమకైనా తెలిసి ఉండాలి. తమ క్యాడర్ లో అనుమానాలు లేకుండా చూడాలి. కానీ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి భిన్నం. ఓవైపు జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతారు. కానీ మరోవైపు పోటీకి మాత్రం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వెనకడుగు వేస్తారు. తీరా ఏకగ్రీవం అవుతుందనుకుంటే ప్రస్తుతం పరిస్థితి పోటీ ఖాయంగా మారింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఢీకొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ రంగంలో దిగాయి.
దాంతో ఇప్పుడు టీడీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. వైఎస్సార్సీపీ కనీసం విన్నవించకుండానే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకున్నారు. ఏకగ్రీవం చేద్దాం మీ అభ్యర్థిని ఉపసంహరించుకోమని పాలకపక్షం కోరి ఉంటే చంద్రబాబు కథ వేరుగా ఉండేది. కానీ వైఎస్సార్సీపీ మాత్రం టీడీపీ పోటీ చేయకపోతే మంచిది, చేసినా ఎదుర్కొంటాం కాబట్టి అది కూడా మంచిదేనని ప్రకటించింది. దానికే చంద్రబాబు సంప్రదాయం. సానుభూతి అంటూ పోటీ నుంచి విరమించుకుని బద్వేలు టీడీపీ నేతలను ఢోలాయమానంలోకి నెట్టేశారు. ఆయన పోటీ నుంచి తప్పుకున్నందుకు పోటీ లేకుండా ఎన్నికలు జరిగిపోతే టీడీపీకి తలనొప్పి లేకపోను. కానీ ఇప్పుడు అనివార్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టీడీపీ ఓట్లు ఎవరికీ అనే ప్రశ్న వస్తోంది.
సానుభూతి, సంప్రదాయం అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్సీపీ అభ్యర్థిని బలపర్చాలి. కానీ అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. పోనీ బీజేపీ పట్ల వన్ సైడ్ లవ్ తో ఉన్నందున వారికి ఓటేయమని చెబుదామంటే తమ విపక్ష స్థానానికే ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్న పార్టీకి పాలుపోసి పెంచినట్టవుతుంది. అలాగాకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకోమని చెబుదామంటే బీజేపీ నేతలకు మరింత దూరం కావాల్సి ఉంటుది. ఇలాంటి సందిగ్ధం రాజకీయంగా టీడీపీకి వ్యూహాత్మక తప్పిదాల మూలంగానే వచ్చిందని చెప్పవచ్చు. ఇంతటి గడ్డు పరిస్థితి ఓ పార్టీగా టీడీపీ ఎదుర్కోవాల్సి రావడం విశేషంగానే చెప్పాలి. ఓటమి తప్పదని తెలిసినా రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను బరిలో దింపిన బాబు బద్వేలులో మాత్రం భిన్నంగా వ్యవహరించి తన శ్రేణులను గందరగోళంలోకి నెట్టేశారు.
టీడీపీ అధిష్టానం రాజకీయంగా ఎంత సందిగ్ధంలో ఉందో ఈ వ్యవహారం స్పష్టం చేస్తుంది. తమ అంచనాలు ఆకాశంలో ఉండగా, పరిస్థితి అడుగు ముందుకేయలేని రీతిలో ఉందని టీడీపీ నేతలు గ్రహిస్తే మంచిది. ఏపీలో జగన్ ప్రభుత్వం విషయంలో టీడీపీ నేతలు తొలుత తమ గందరగోళం నుంచి బయటపడాల్సి ఉంటుంది. లేదంటే బద్వేలు టీడీపీ మాదిరిగానే అన్ని చోట్లా పార్టీ అధినేత తీరు వల్ల అనవసరంగా ఇక్కట్లు కొనితెచ్చుకున్నట్టవుతుంది.