iDreamPost
iDreamPost
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ గెలుపు లాంఛనమే అయినా విపక్షాల వ్యూహాలు చర్చనీయాంశం అవుతున్నాయి. తొలుత తామిద్దరూ బరిలోంచి తప్పుకున్నట్టు టీడీపీ. జనసేన ప్రకటించాయి. కానీ ఆతర్వాత మనసు మార్చుకున్న జనసేన నేరుగా బీజేపీ అభ్యర్థికి మద్ధతు ప్రకటించింది. టీడీపీ మాత్రం బహిరంగంగా ఎవరికీ అండగా ఉంటామని చెప్పకపోయినా అంతర్గతంగా టీడీపీ ఓట్లు బీజేపీకి వేయించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు కూడా దానిని బలపరుస్తున్నాయి. టీడీపీ ఓట్లు తమకు వేస్తామంటున్నారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందని టీడీపీ భావిస్తోంది. ప్రజలు కూడా నమ్మాలని ఆశిస్తోంది. అదే నిజమయితే ఉప ఎన్నికల బరిలో దిగి అధికార పార్టీ హవాకి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. కనీసం మెజార్టీ తగ్గించడం ద్వారా తమ బలం పెరిగిందని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయినా టీడీపీ అందుకు సిద్ధం కాలేదు. భారీ తేడాతో ఓటమి అనివార్యమనే ఆందోళనతో అభ్యర్థిని ప్రకటించి కూడా వెనక్కి తీసుకుంది. అయితే బీజేపీ అభ్యర్థిని బలపరచాలనే ఆలోచన చేయడం టీడీపీ మరోసారి కొరివితో తలగోక్కున్నట్టవుతుందనే అభిప్రాయం ఆపార్టీ నేతల్లోనే వినిపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ దూకుడు అడ్డుకోవాలనే లక్ష్యంతోనే టీడీపీ రంగంలో దిగింది. అప్పట్లో పనబాక లక్ష్మి పోటీకి ససేమీరా అన్నప్పటికీ బాబు, సోమిరెడ్డి స్వయంగా ఆమెని కలిసి నచ్చజెప్పారు. బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య పోటీ అంటే తమ ప్రభావం పడిపోతుందనే లెక్కలేసి, రెండోస్థానం కోసం నేరుగా బీజేపీతో తలపడ్డారు. చివరకు బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నందుకు ఊపిరిపీల్చుకున్నారు. కానీ బద్వేలుకి వచ్చేసరికి మళ్లీ బీజేపీనే బలపరిచే దిశలో సాగడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జతగట్టాలనేది టీడీపీ ఆశ. రెండేళ్లుగా అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. అలాంటి సమయంలో రాబోయే రెండేళ్లలో ఏదో జరుగుతుందని ఊహించుకుని ఇప్పటి నుంచే బీజేపీని బలపరిచే దిశలో వెళితే అది తమకే చేటు తెస్తుందని టీడీపీ లో కొందరి వాదన.
బీజేపీకి ఓట్ల శాతం పెరిగితే ఏపీలో తమ బలం పెరిగిందని చెప్పుకోవడానికి సిద్ధపడతారనేది టీడీపీ అనుమానం. తద్వారా ఒకవేళ కూటమి కట్టినా బీజేపీ ఉప ఎన్నికల బలాన్ని చూపించి ఎక్కవ సీట్లు ఆశించే ప్రమాదం ఉంటుంది. అందుకే బీజేపీని నియంత్రించాలనేది ఓ అభిప్రాయం. అదే సమయంలో టీడీపీ పోటీ ఇవ్వలేక తప్పుకుంటే తాము ధైర్యంగా నిలబడ్డామని ప్రజల ముందు చెప్పుకుంటున్న బీజేపీ ఆ తర్వాత కూడా తామే ప్రధాన పోటీదారు అని చెప్పుకోదనే గ్యారంటీ లేదు. కాబట్టి బీజేపీని బలపరచడం అంటే టీడీపీని చేజేతులా బలహీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టేనన్నది వారి సందేహం. ఈవిషయంలోనే టీడీపీ నేతల్లో డైలామా కనిపిస్తోంది. ఏం చేయాలన్నది అంతుబట్టకుండా ఉంది. బద్వేలు టీడీపీ శ్రేణులకు ఏమీ చెప్పకుండా వదిలేయాలా, బీజేపీ బలం పెంచేందుకు తోడ్పడాలా అన్నది టీడీపీ లో భిన్నవాదనలకు ఆస్కారమిస్తుండడం విశేషం.
Also Read : Narreddy Tulasi Reddy – బద్వేలు ఉప ఎన్నిక.. వైసీపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ అంట..!