iDreamPost
android-app
ios-app

రాష్ట్రానికి బాబు రాక.. డీజీపీ చేతుల్లో..

రాష్ట్రానికి బాబు రాక.. డీజీపీ చేతుల్లో..

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 25వ తేదీన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖ చేరుకుని బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి అదే రోజు సాయంత్రం రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకుంటానని.. అందుకు అనుమతులు ఇవ్వాల్సింది ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు పర్యటన రేపు అంటే.. సోమవారం షెడ్యూల్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏపీ డీజీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులు ఉన్న నేపథ్యంలో అనుమతి మంజూరు లాంఛనమే కావచ్చు. ఈ రోజు సాయంత్రం లోపు చంద్రబాబు పర్యటన అనుమతిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనుమతి వచ్చాక.. చంద్రబాబు తాను ఒక్కరే రాష్ట్రానికి వస్తారా..? లేక తన తనయుడు, మాజీ మంత్రి లోకేష్‌ను కూడా తాడేపల్లి తీసుకువస్తారా..? వేచి చూడాలి.

కాగా, ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగిన సమయంలో చంద్రబాబు.. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖను కోరారు. ఆ మేరకు లేఖ రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రేపు, మాపో.. అనుమతి వస్తుందంటూ చంద్రబాబు తన జూమ్‌ సమావేశాల్లోనూ, విలేకర్ల సమావేశాల్లోనూ చెప్పకొచ్చారు. తాను హైదరాబాద్‌లో ఉన్న మనసు అంతా విశాఖలోనే ఉందంటూ విలేకర్ల ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.