iDreamPost
iDreamPost
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు చెల్లించడానికి కేంద్రం ససేమీరా అంటోంది. అవరసమైన మేరకు నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమనే సంకేతాలు ఇచ్చేసింది. తాజాగా రాజ్యసభ వేదికగా పాతపాటనే పాడింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ సమాధానం పోలవరంపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు జల్లేలా కనిపిస్తోంది. వేగంగా సాగుతున్న పనులు కొలిక్కి వస్తాయని ఆశిస్తుంటే అసలు నిధులు తాము ఇవ్వడానికి రెడీగా లేమని ఆయన తేల్చేశారు. 2014 నాటి అంచనాల ప్రకారం మాత్రమే నిధులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఆయన గతంలో చెప్పిన దానినే పునరావృతం చేశారు.
కేంద్రం జాతీయ ప్రాజెక్టు విషయంలో ఇంత నిర్ద్వందంగా వ్యవహరించడానికి అసలు కారణం ఆరా తీస్తే చంద్రబాబు సర్కారు ఘన కార్యం బయటపడుతంది. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని వేగవంతంగా కడతామనే పేరుతో చంద్రబాబు రాష్ట్రం నెత్తిన పెట్టారు. వాస్తవానికి తమ కులానికి చెందిన ట్రాన్స్ ట్రాయ్, ఆ తర్వాత నవయుగ కంపెనీల ప్రయోజనాల కోసమే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకున్నట్టు అందరికీ అర్థమయ్యింది. చివరకు ప్రధాని కూడా ఈ ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని కూడా విమర్శించేందుకు దారితీసింది. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రం ఆ బాధ్యతను భుజానకెత్తుకోవడం వల్ల చంద్రబాబు సొంత మనుషులకు లాభం చేకూరినప్పటికీ ఏపీకి మాత్రం అది శిరోభారం అయ్యింది. అంటే బాబు లక్ష్యం నెరవేరింది. ఏపీ ప్రజల ఆశలు మాత్రం నెరవేరలేదు.
Also Read : రాజకీయాలు వేరు – బ్యూరోక్రాట్ల రాజకీయాలు వేరు
నిజంగా పనులు వేగవంతం చేస్తామని ఆయన చెప్పిన మాటలు కూడా ఆచరణ రూపం దాల్చలేదు. ఫలితంగా అంచనా వ్యయం పెరిగింది. దానిని కూడా కేంద్రం భరించాల్సి ఉన్నప్పటికీ 2016 లో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబు చేసిన హంగామా ఏపీకి, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద శాపంగా తయారయ్యింది. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపే వరకు తానూ ప్రమాణస్వీకారం చేయనని చెప్పడంతోనే ఆరు విలీన మండలాలను కలిపారని చెప్పుకున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు ఇచ్చే వరకూ కూడా అలాంటి పంతం ఎందుకు పట్టలేదన్నది ఎవరికీ అంతుబట్టదు. అదే సమయంలో కేంద్రం నుంచి అంచనా వ్యయం పెంపుదల విషయంలో సంబంధం లేకుండా తామే పోలవరం కట్టుకుంటామని చంద్రబాబు అంగీకరించడం గమనార్హం. 2016 మార్చి 26న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తీర్మానంలో పోలవరం వ్యయం పెరిగినా దానికి కేంద్రం బాధ్యత వహించదని పేర్కొన్నారు. ఆనాటి సమావేశంలో టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు. ఫలితంగా ఇప్పుడు కేంద్రం డీపీఆర్ 2ని టెక్నికల్ కమిటీ ఆమోదించినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి మాత్రం కొర్రీలు వేస్తోంది.
2014 నాటి నిర్మాణం వ్యయం మాత్రమే తాము ఇస్తామని, అందులో ఇప్పటికే 11000 వేల కోట్లు ఇచ్చేశామని కేంద్రం చెబుతోంది. అంటే మిగిలిన మొత్తంతో ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్, పునారావాసం, పవర్ స్టేషన్ నిర్మాణం ఎలా అన్నది అతి పెద్ద సందిగ్ధంగా మారింది. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మొదలయిన పోలవరం భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసిన బాబు పుణ్యాన ఏపీకి వర ప్రసాదం అనుకున్న పోలవరం కాస్తా ఇప్పుడు పెనుభావరం అవుతుందా అనే అనుమానాలు బయలుదేరాయి.
Also Read : కల సాకారమవుతోన్న వేళ.. పోలవరం పరుగులు పెట్టిందిలా..