iDreamPost
iDreamPost
రాష్ట్రంలో 12 మున్సిపాలిటీల్లో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు అందుతాయి. ముందుగా అనుకున్నట్టే అన్ని చోట్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే అన్నీ ఒక ఎత్తు, కుప్పం ఒక ఎత్తు. కుప్పం ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోంది.
ఇప్పుడు ఈ ఎన్నికలు, వాటి ఫలితాల వల్ల రాష్ట్రంలో పెద్ద మార్పులేమీ కనిపించకపోవచ్చు. కానీ, కుప్పం ఫలితాలు మాత్రం రాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలుగుతుంది. కుప్పం అంటే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఇది 1989 నుండి వరుసగా ప్రతి ఎలక్షన్ లోనూ చంద్రబాబు నాయుడు గెలుస్తూనే ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రచారం చేయకపోయినా, నామినేషన్ వేయడానికి రాకపోయినా, గెలుపు ధ్రువీకరణ పత్రం తీసుకోడానికి రాకపోయినా, మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎన్నికలలోపు ఒక్కసారి కూడా రాకపోయినా ఓటర్లు వరుసగా ఆయన్ను గెలిపిస్తూనే ఉన్నారు.
అయితే 1989 నుండి 2014 వరకు రాష్ట్రంలో రాజకీయాలు వేరు, ఆ తర్వాత నుండి రాజకీయాలు వేరు అని చెప్పాల్సిందే. 1989 నుండి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు మొదటి సారిగా 2014లో గట్టి పోటీ ఎదుర్కున్నారు. ఆ తర్వాత 2019లో ఆయనకు ఓటమి భయం మొదలయ్యింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి దిశగా నడిచి చివరికి చావు తప్పి కన్నులు లొట్టపోయి అన్నచందంగా గెలిచి ఊపిరి పీల్చుకున్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చూసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త రాజకీయాలు చూస్తున్నారు. మొదట జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు చాలా తక్కువ అంచనా వేశారు. తనకు అనుకూలంగా వుండే మీడియా సహకారంతో, ఇతర వ్యవస్థల్లో ఉన్న తన మద్దతుదారులు సహకారంతో జగన్మోహన్ రెడ్డిని నిలువరించ వచ్చని అనుకున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో, ముఖ్యంగా యువతలో కలిగిన భావోద్వేగాల కారణంగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఉండేలు దెబ్బతో పిల్లకాకిని తేలిగ్గా కోట్టేయొచ్చు అనుకున్నారు. అసలు 2014 విజయం తన ఉండేలు దెబ్బ గొప్పతనమే అనుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చంద్రబాబు నాయుడు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, జాతీయ రాజకీయాల్లో పరిచయాలు, వివిధ వ్యవస్థల్లో ఉన్న ఆయన మనుషుల శక్తి సామర్ధ్యాలు చంద్రబాబు నాయుడు కళ్ళకు పొరలు కప్పేశాయి. జగన్మోహన్ రెడ్డికి వ్యూహం ఉంటుందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించలేదు. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమల ఏర్పాటు, రాష్ట్ర ఆర్ధిక లోటు వంటి కీలక అంశాలు తిరిగి 2019లో తనకు విజయం తెచ్చిపెడతాయని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్మారు. అందుకే 2017లో రాష్ట్ర శాసనసభ నుండి ఆయన బయటకు వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అవహేళన చేశారు. కానీ అప్పుడు శాసనసభలో బయటకు వేసిన తొలి అడుగు చంద్రబాబు నాయుడుని శాశ్వతంగా అధికారానికి దూరంగా పెట్టే తొలి అడుగు అని గ్రహించలేక పోయారు.
ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలపై, ఆయన రాజకీయ భవిష్యత్తుపై, మొత్తంగా ఈ రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు పై ప్రభావం చూపనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూడనుంది అని సర్వేలు చెపుతున్నాయి. మొత్తం 25 వార్డుల మున్సిపాలిటీలో కనీసం 20 వార్డుల్లో టీడీపీ ఓడిపోనుంది. ఈ ఓటమితో కుప్పం చంద్రబాబు నాయుడు చేయి జారిందనే అనుకోవాలి. ఇక 2024 నాటికి చంద్రబాబు నాయుడు మరో కొత్త నియోజకవర్గం చూసుకోవాల్సిందే.