Idream media
Idream media
చంద్రబాబు కోసం కొంత మంది టీడీపీ నేతలు తమ సొంత సొంత ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సొంత ప్రాంత అభివృద్ధిని బాబు మెప్పుకోసం ఫణంగా పెడుతున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సాగుతూ సొంత ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.
మూడు రాజధానులు వద్దు.. రాజధానిగా ఒక్క అమరావతి మాత్రమే ఉండాలన్న చంద్రబాబు మాటకు రాష్ట్రంలోని పలువురు టీడీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారు. మెజారిటీ నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తుండగా పలువురు నేతలు మాత్రం తమ అధినేత మెప్పు కోసం, సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కోసంతో మూడు రాజధానులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతి మాత్రమే కావాలని ఆందోళనలు చేస్తున్నారు.
సాగునీరు లేక ఏళ్ల తరబడి రాయలసీమ ప్రాంతం వెనకపడిందని ప్రజలే కాదు ఆ ప్రాంత రాజకీయ నేతలు సందర్భానుసారం ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారు. ఇక సీమను ఆనుకుని ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఈ ఆరు జిల్లాలలోని గ్రామాల నుంచి వలసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. కనీస జీవన ప్రమాణాలు కూడా ఆయా జిల్లాలో మచ్చుకు కనిపించవు. ఇక ఉన్నత చదువులు మాట దేవుడెరుకు.. ఉన్నతపాఠశాల విద్య కూడా పూర్తి కాకముందే వలస బాట పట్టిన పిల్లలున్నారు.
సాగునీరు లేక బీడువారిని పొలాల్ని వదిలి.. రైతులు కృష్ణా, గుంటూరు జిల్లాలో వరికోతల సమయంలో ఉపాధి కోసం వలస వెళుతున్నారు. గుంటూరు, కృష్షా జిల్లాలోని మార్కెట్లలో మూటలు మోసే పని చేస్తున్నారు. ఈ జిల్లాల నుంచి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు వలసలు సర్వసాదారణం. ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి. ఈ జిల్లాల ప్రజలు రోడ్ల నిర్మాణం, సిమెంట్ పనులు చేసే కంపెనీల్లో పనుల కోసం వలస వెళుతున్నారు. ఇటుక బట్టీల్లో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి బతుకు బాట పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంపన్న ప్రాంతాలు అంటే గుంటూరు, కృష్ణా, ఉభయగోదారి జిల్లాలు మాత్రమే. కృష్ణా, గోదావరి నదులతో ఆ జిల్లాలు సశ్యశ్యామలమయ్యాయి. కరువు అంటే ఏమిటో ఆయా జిల్లాల ప్రజలకు తెలియదు. నదీ జలాలతో రెండు పంటలు పుష్కలంగా పండుతాయి. వ్యవసాయం సంవృద్ధిగా సాగుతుండడంతో అక్కడ అక్షరాస్యతశాతం ఎక్కువే. ఉన్నత చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నా వారిలో అధికశాతం మంది నాలుగు జిల్లాలకు చెందిన వారే. రెండు పంటలు పండే నీటి సౌకర్యాలు ఉండడంతో వ్యవసాయ కూలీలకు ఏడాదంతా పనే. ఉపాధి కోసం వలస అనే మాట నాలుగు జిల్లాల్లో ఉండదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రసర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు హర్షం ప్రకటిస్తున్నారు. అయితే చంద్రబాబు మాటలు వింటున్నకొంత మంది మూడు రాజధానుల ప్రతిపాదను వ్యతిరేకిస్తూ ఆయా ప్రాంతాల ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.
టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిల ప్రియ, కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, ముక్కు ఉగ్రనరహింహారెడ్డి, ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు ఆయా ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సాగుతున్నారు. మూడురాజధానుల వల్ల మూడు ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉపాధి కోసం వలసలు పోవాల్సిన అవసరం ఉండదనీ, భూముల విలువ పెరుగుతుందన్న ప్రజల ఆశలపై టీడీపీ నేతలు నీళ్లు చల్లుతున్నారు. తమ అధినాయకుడి మెప్పు కోసం ప్రజా ద్రోహానికి పాల్పడుతూ వారి బతుకుల్లో మార్పుకు అడ్డుపడుతున్నారు.