Idream media
Idream media
25 ఏళ్ల క్రితం కడప జిల్లా రాజంపేటలో ఒక పెళ్లి జరిగింది. వరుడు తలకి బాసికం కట్టుకోడానికి నిరాకరించాడు. అక్షింతలు తలమీద పడినా కోపగించాడు. తిరుగు పెళ్లిలో గాలికి తన జుత్తు చెదిరిపోతుందని జీపులో కూర్చోడానికి ఇష్టపడలేదు. మొదటి రాత్రి అమ్మాయికి అర్థమైంది. అతనికి జుత్తు లేదని, విగ్గుతో మోసం చేశాడని. అప్పుడు ఇది ఆసక్తికరమైన వార్త అనే అనుకున్నాను. ఇది అద్భుతమైన సినిమా కథ అని బాలా సినిమా చూశాక అర్థమైంది.
ఆయుష్మాన్‌ఖురానా ఈ రోజు బాలీవుడ్‌లో సక్సెస్‌పుల్ హీరో. తక్కువ ఖర్చుతో తీసే అతని సినిమాలు సులభంగా వందకోట్లకు పైగా వసూల్ చేస్తున్నాయి. బాలా కూడా ఈ కోవలోదే.
కులం, మతం, ప్రాంతం, రంగు, రూపం ఇవేవీ మన చాయిస్ కాదు. జీవితం మాత్రమే మనది. చిన్న వయస్సులోనే జుత్తు ఊడిపోతే ఏం చేయాలి? ఇన్‌పీరియారటీతో బాధపడే ఒక కుర్రాడి కథ. జుత్తు కోసం రకరకాల తైలాలు వాడుతారు. (ఈ దేశంలో వేల కోట్ల వ్యాపారం జుత్తు పెరగడంపై నడుస్తోంది. ఎవరికి జుత్తు పెరిగిన దాఖలాలు లేవు. హెయిర్‌డై లేని రోజుల్లో తెల్లవి నల్ల వెంట్రుకలుగా మార్చే ఆయిల్స్‌కి డిమాండ్ ఉండేది) చివరికి ఒక విగ్ పెట్టుకుంటాడు. ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి వరకు వస్తుంది. ఆ అమ్మాయికి హెయిర్‌స్టైల్ పిచ్చి. ఇతనికి హెయిర్ లేదు. చెప్పాలనుకుంటాడు చెప్పలేడు. చివరికి మెసేజ్ ఇస్తాడు. కానీ పొరపాటున అది వేరే వాళ్లకు వెళుతుంది. తొలి రాత్రిని కూడా దాటవేస్తాడు. కానీ నిజం తెలుస్తుంది. ఆ అమ్మాయి విడాకులు కోరుతుంది.
ఇదే సినిమాలో నల్లగా ఉన్న ఒక అమ్మాయి కథ సమాంతరంగా నడుస్తుంది. నల్లగా ఉండేవాళ్లు తెల్లగా మారడానికి క్రీముల వ్యాపారం వేల కోట్లలో జరుగుతుంది. కానీ ఎవరూ తెల్లగా కారని అందరికీ తెలుసు. మనల్ని మనం యధాతథంగా అంగీకరించాలి అని ఆ అమ్మాయి అభిప్రాయం. మొత్తం మీద ఈ సినిమా బాక్సాపీస్ కొల్లగొట్టింది.
తెలుగులో కథల్లేవని అంటుంటారు. ఇలాంటి కథ చెబితే రచయితని గెంటేస్తారు. హిందీలో టాయిలెట్ సమస్యపై ,ఆడవాళ్ల నెలసరి సమస్యలపై సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి.
ఆయుష్మాన్ ఫస్ట్ సినిమా విక్కీ డోనర్ వీర్యాన్ని దానం చేసే కుర్రాడి కథ. దీన్ని తెలుగులో తీశారు. ప్లాప్. ఎందుకంటే రీమేక్‌లో కథని మాత్రమే తీసుకుని ఆత్మని చంపేశారు.
మనవాళ్లు హీరోయిజం నుంచి బయటపడితే కొత్త కథలు వస్తాయి.