iDreamPost
android-app
ios-app

అయోధ్య వివాదం పూర్వాపరాలు- నేటి తీర్పు

  • Published Nov 09, 2019 | 4:59 AM Updated Updated Nov 09, 2019 | 4:59 AM
అయోధ్య వివాదం పూర్వాపరాలు- నేటి తీర్పు

అయోధ్య వివాదం పైకి మత అంశంలాగా కనిపించినా  వాస్తవంగా దానిలో రాజకీయ అంశాలే ఎక్కువ. 1885లో మొదలైన వివాదం 1986లో స్థానిక కోర్టు ఆదేశాల మేరకు గేట్లు తెరిచి శిలాన్యాస్ కు అనుమతించడంతో బిజెపి చేతికి ఆయుధం దొరికింది. 

మధ్యప్రదేశ్ కు చెందిన షాబానో అనే మహిళా విడాకుల భరణం విషయంలో  సుప్రీం కోర్టు 1984లో “ముస్లిం లా” ఎలా ఉన్న విడాకుల తరువాత ఆ మహిళ పోషణకు మాజీ భర్త భరణం ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ తీర్పు స్ఫూరికి భిన్నంగా విడాకులు,భరణం విషయంలో ముస్లిం లా ను బలపరుస్తూ చట్టం తెచ్చింది. ఈ చర్య రాజీవ్ గాంధీ ప్రభుత్వం పట్ల మహిళల్లో  తీవ్ర వ్యతిరేకత వొచ్చింది. ఇదే సమయంలో 1986లోఒక  స్థానిక కోర్టు ఆదేశాల మేరకు యాభై ఏళ్లుగా తాళాలు వేసి వున్న వివాదాస్పద రామజన్మభూమి స్థలం తాళాలు తెరిపించారు. ఒక మతతత్వ ఒత్తిడి మరో మత ఒత్తిడికి ఎలా అవకాశమిస్తుందో రాజీవ్ గాంధీ ప్రత్యక్షంగా నిరూపించారు. గేట్లు తెరిచిన వెంటనే బిజెపి ‘శిలాన్యాస్‌’ తదితర తతంగాలు తలపెట్టింది. 

బోఫోర్స్ వ్యవహారంతో VP సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి జనతాదళ్ ను ఏర్పాటు చేసి 1989 ఎన్నికల్లో ఉత్తరాదిలో బలమైన నాయకుడిగా ఎదిగారు. మరో వైపు బీజేపీ అయోధ్యలో రామమందిరం నిర్మాణం పేరుతో  విస్తృతంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా బలపడే ప్రయత్నం చేసింది. 

జనతాదళ్,బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవటానికి రాజీవ్ గాంధీ 1989 ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య నుంచి ప్రారంభించారు.వి.పి.సింగ్‌ కూడా యుపి, బీహార్‌లో బిజెపితో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 197 సీట్లతో పెద్ద పార్టీగా ఆవతరించింది కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 273 సంఖ్యను అందుకోలేకపోయింది. జనతాదళ్  143 స్థానాలు గెలవగా ,బిజెపి మొదటిసారిగా 86 స్థానాలతో పెద్ద శక్తి గా ఎదిగింది . బీజేపీ ,కమ్యూనిస్టుల మద్దతుతో వి.పి.సింగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

బీజేపీ రాజకీయంగా ఎదగటానికి రామజన్మభూమి లాంటి పాశుపతాస్త్రాన్ని వాడుకుంటూ 1990 మార్చిలో జరిగిన  హిమాచల ప్రదేశ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.అద్వానీ రథయాత్రను ప్రకటించగా వి.పి.సింగ్‌ OBCరిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమీషన్ సిఫార్సులు అమలు పరిచి ఆ వర్గాలలో  మద్దతును కూడకట్టుకునే ప్రయత్నం చేశారు.  అద్వాని 25-Sep-1990న గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా రధయాత్ర మొదలుపెట్టారు. గుజరాత్ నుంచి దక్షిణంగా మహారాష్ట్ర,హైదరాబాద్ కు అక్కడి నుంచి ఉత్తరంగా నాగపూర్ మీదుగా మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఢిల్లీకి చేరుకొని అక్కడి నుంచి ట్రైన్లో పూర్వ బీహార్లోని ధనబాద్ చేరుకొని అక్కడి నుంచి రధయాత్రను బీహార్ మొత్తం చుడుతూ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించేలా మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. బీహార్లోని Samastipur లో లాలు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం అద్వానీని రెస్ట్ చేసింది. అద్వానీ అరెస్టుకు నిరసనగా బిజెపి VP సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ VP సింగ్ ప్రభుత్వాన్ని ఆదుకోకపోవటంతో ఆయన రాజీనామా చేశారు.కాంగ్రెస్ మద్దతుతో సమాజవాది పార్టీ  చంద్రశేఖర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ అది కూడా ఏడు నెలలోనే కూలింది. 

దీనితో 1991లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్య ,పీవీ నర్సింహరావ్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వం  ఏర్పడింది,120 సీట్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.1991లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలిచి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీజేపీ 1992 డిసెంబర్లో కరసేవకు పిలుపునిచ్చింది. ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుకను తీసుకురావాలని కోరింది. 

06-Dec-1992 న అయోధ్యలో  బాబ్రీ మసీద్ కూల్చివేస్తారని అప్పటి మంత్రులు అర్జున్ సింగ్,చవాన్ తదితరులు చెప్పినా పీవీ నర్సింహా రావ్ కళ్యాణ్ సింగ్  ప్రభుత్వం మీద చర్యలు తీసుకోలేదు,సైన్యాన్ని అయోధ్యకు పంపలేదు… అనుకున్నట్లుగానే బాబ్రీ మసీద్ ను కూల్చివేశారు ,ఆసమయంలో ఎవరి ఫోన్లు ఇవొద్దని చెప్పి పీవీ పూజలో కూర్చున్నాడంట. 

బాబ్రీ మసీద్ కూల్చివేత తరువాత జరిగిన హింస,ప్రతి హింస  ,ముఖ్యంగా బొంబాయి లో సీరియల్ బాంబు పేలుళ్లు చేసిన గాయాలు ఇప్పటికి మానలేదు. అభివృద్దే గెలిపిస్తుందన్న పీవీ నమ్మకం 1996 ఎన్నికల్లో తిరగబడి కాంగ్రెస్ అధికారం చేజార్చుకుంది. బీజేపీ ఒక్కోమెట్టు ఎక్కుతూ 2014లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచి మరోసారి అధికారంలోకి వొచ్చింది. “మందిర్ వహీ బనేగా” అనే మోడీ మాట మరి  కొంత సమయంలో నిజం అవుతుందా?సుప్రీం కోర్ట్ ఏమి తీర్పు ఇవ్వబోతుంది?నేటి తీర్పే అంతిమ తీర్పు,దీనికి పైన ఇంకా ఎలాంటి బెంచ్ లేదు. 

తీర్పు ఏ విధముగా ఉన్నా గతంలో జరిగిన హింసను మరోసారి హిందూ,ముస్లిములు ,ఇతర వర్గాలు కోరుకోవటంలేదు.ప్రశాంతత ముఖ్యం.