iDreamPost
iDreamPost
నిన్న జాతీయ అవార్డులు ప్రకటించడం టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. హోల్ సం ఎంటర్ టైనర్, కొరియోగ్రఫీ రెండు విభాగాలను మహర్షి సొంతం చేసుకోగా బెస్ట్ తెలుగు ఫిలింతో పాటు ఎడిటింగ్ కి సంబంధించి నాని జెర్సీకి పురస్కారం దక్కడం ఇద్దరు హీరోల అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అయితే ఈ ఎంపిక పారదర్శకంగానే జరిగిందా అనే చర్చ సోషల్ మీడియాలో జరగడం గమనార్హం. ఈ మాత్రం అవార్డులైనా ఇచ్చారు కదాని అల్ప సంతోషంతో వాస్తవాలను విస్మరిస్తే ఎలా అని అడుగుతున్నారు. ఇలా అడగడానికి కారణాలు లేకపోలేదు. ఇప్పుడీ టాపిక్ హాట్ గా మారడానికి కారణం కూడా ఇదే.
నేతన్నల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ నిజ జీవిత కథను తెరకెక్కించిన మల్లేశంను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సదరు నిర్మాతలే అప్లై చేయలేదా లేదా కమిటీకి ఇందులో ఏం కనిపించలేదా అనే ప్రశ్న తలెత్తడం సహజం. కమర్షియల్ రేంజ్ ని పక్కనపెడితే మల్లేశం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. చాల సహజంగా తీశారని పేరు కూడా వచ్చింది. జెర్సీతో పోటీ పడేంత ఎమోషన్ ఇందులోనూ ఉంది కదా అంటే సమాధానం చెప్పడం కష్టం. చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహారెడ్డిని సైతం సదరు అవార్డు సభ్యులు గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే.
ఇంకా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. యాత్ర, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా, జార్జ్ రెడ్డి లాంటివి పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ మరెందుకనో వీటిపై శీతకన్ను పడింది. ఇవన్నీ బాక్సాఫీస్ లెక్కల్లోనూ విజయం సాధించినవే. అయినా నేషనల్ అవార్డులకు కంటెంట్ చూస్తారు తప్పించి అవి హిట్టయ్యాయా లేదా అనేది పట్టించుకోరు. అసలు విడుదలే కానీ మోహన్ లాల్ మరక్కర్ కు అవార్డు రావడం అసలు ట్విస్ట్. ఆ ఏడాదిలో రిలీజ్ అనుకుని వాయిదా వేసుకుంటూ వచ్చిన మాట నిజమే కానీ 2021లో రిలీజ్ అయ్యే సినిమాకు 2019 అవార్డు ఇవ్వడం మాత్రం చాలా అరుదు.