ఒక మంట దాదాపు 50 కోట్ల మూగ జీవాల్ని సజీవ దహనం చేసింది..
ఒక మంట దాదాపు లక్షా నలభై ఎనిమిది వేల ఎకరాల అటవీ విస్తీర్ణాన్ని బూడిద చేసింది..
ఒక మంట దాదాపు వెయ్యి మందికి తమ ఆశ్రయాలను కోల్పోయేలా చేసింది.
ఆ మంటలే ప్రకృతి శక్తుల ముందు మానవుడు చిన్న పిపీలికంతో సమానమని నిరూపిస్తూ అంతకంతకూ చెలరేగుతూ ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రేపుతున్న ‘ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్’
విపరీతమైన కరువు, అంచనాలకందని పర్యావరణ మార్పులే ప్రధానమైన కారణమైనప్పటికీ ఆ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో మానవ వైఫల్యం పాత్ర కూడా విస్మరించలేనిది లేకుంటే గత ఆగష్టు నెల నుండి రావణ కాష్టంలా రగులుతూ నానాటికీ విస్తరిస్తున్న విధ్వంసానికి చేతులుడిగి చూస్తుండటం దేనికి సంకేతం?
ఆగ్నేయ ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ లో మొదలైన కార్చిచ్చు ఈశాన్య ఆస్ట్రేలియా వైపు విస్తరిస్తూ మరింత విధ్వంసం దిశగా సాగుతోంది. దాని ధాటికి తట్టుకోలేని న్యూసైత్ వేల్స్ గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటించిందంటే ఆ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. గత రెండు రోజులుగా తగ్గిన వేడి గాలులూ, కురుస్తున్న వర్షాల వల్ల కొంచెం తెరపినిచ్చినప్పటికీ మళ్లీ గురువారం నుండి పుంజుకునే అవకాశం ఉందనే పర్యావరణ నిపుణుల సూచనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరగుదల, ప్రకృతి విపత్తులు ప్రస్తుత కారణాలుగా కనపడుతున్నప్పటికీ మానవాళి గుర్తించవని, గుర్తించినా కూడా నిర్మూలించలేని నిగూఢ శతృవు మాత్రం గ్లోబర్ వార్మింగే. అవును మానవుడు తన మేధస్సుతో ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నా అని భ్రమిస్తూ దాని మాటున జరిగే పర్యావరణం గురించి పట్టించుకోనంత కాలం ఇలాంటి విపత్తులను ముందు ముందు ఎన్నో చూడవలసి ఉంటుంది. జంతువుల మీద ప్రేమతో రెస్ట్ ఇన్ పీస్, సేవ్ ఆస్ట్రేలియా అని నినదించే మన నినాదాలు కొంచెం ఆత్మ సంతృప్తిని మాత్రమే కలిగించొచ్చు గానీ దానికి సరైన పరిష్కారం కాదు. ఓ మానవుడా ఇకనైనా కళ్ళు తెరిచి చూడు