iDreamPost
android-app
ios-app

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ వాయిదా

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ వాయిదా

క్రికెట్ అభిమానులు ఊహించిందే జరిగింది.వచ్చే అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది.సోమవారం జరిగిన బోర్డు వర్చువల్ మీటింగ్‌లో టీ-20 ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది.దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్‌కు మార్గం సుగుమమైంది.

గత మే చివరలో కరోనా విజృంభణ కారణంగా టీ-20 ప్రపంచకప్‌కు తాము ఆతిథ్యం ఇవ్వలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.కానీ ఐసీసీ అధికారకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణి అవలంబించింది.ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్‌ మనోహార్‌ ఉన్నంతకాలం ప్రపంచకప్ నిర్వహణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.కానీ ఇటీవల ఆయన ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మెగాటోర్నీ వాయిదాకు లైన్ క్లియర్ అయింది.

మూడేళ్లలో 3 ప్రపంచ కప్ టోర్నీలు:

టీ-20 ప్రపంచకప్‌ను వాయిదా వేసిన ఐసీసీ భవిష్యత్తులో జరగాల్సిన ప్రపంచకప్‌ల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసింది.ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే టీ-20 ప్రపంచ కప్-2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరగనుంది.అలాగే భారత్‌లో జరిగే టీ-20 ప్రపంచ కప్-2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు.ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న జరుగుతుంది.ఇక టీ-20 ప్రపంచ కప్-2023 కూడా అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహించనుండగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 26 న జరగనుంది.అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ వేదికగా జరిగే మహిళల టీ-20 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది.

కాగా 2023లో భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ కూడా అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్నడం విశేషం. ఈ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నవంబర్ 26న జరిగే విధంగా ఐసీసీ షెడ్యూల్ రూపొందించింది.