iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ పై కోర్టు ధిక్కారణకు ససేమీరా అంటున్న అటార్నీ జనరల్

  • Published Nov 08, 2020 | 3:19 PM Updated Updated Nov 08, 2020 | 3:19 PM
సీఎం జగన్ పై కోర్టు ధిక్కారణకు ససేమీరా అంటున్న అటార్నీ జనరల్

సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదు ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. బీజేపీ నేత, అడ్వొకేట్ అశ్విన్ కుమార్ ప్రతిపాదనను ఇప్పటికే అటార్నీ జనరల్ ఓ మారు తోసిపుచ్చారు. అయినప్పటికీ కోర్ట్ ధిక్కారణ కిందకు వస్తుందంటూ మరోసారి లేఖ రాసినా ఏజీ తన వాదనకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసేశారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి రాసిన లేఖలో ఈ మేరకు ఏజీ కే కే వేణుగోపాల్ సమాధానమిచ్చారు.

సీఎం జగన్ తో పాటుగా ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం పై కోర్టు ధిక్కరణ చర్యలకు అంగీకరించడానికి నిరాకరించిన ఏజీ , మరోసారి పునః సమీక్ష చేయాలని అశ్విన్ కుమార్ కోరారు. అయినప్పటికీ ఏజీ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు తేల్చేశారు. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణతో పాటుగా కొందరు ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తుల తీరుపై జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత నెల ఆరున జగన్ ఫిర్యాదు చేశారు. 8వ తేదీన నేరుగా అందజేశారు. ఆ లేఖను అక్టోబర్ 15న అజయ్ కల్లం మీడియాకు విడుదల చేశారు.

ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ వైయస్ జగన్, అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చెయ్యాలని అభ్యర్థిస్తూ సుప్రీం కోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖను పరిగణలోకి తీసుకునేందుకు ఏజీ తొలుత నిరాకరించారు. అయినప్పటికీ పట్టువీడని అశ్వినీకుమార్ రెండోసారి ఇదే విషయమై ఏజీ వేణుగోపాల్ కి లేఖరాశారు. సుప్రీంకోర్ట్ చట్టం 1971లోని రూల్ 3(సీ) ప్రకారం పరిగణించాలనే ప్రతిపాదన లేదని ఏజీ పునరుద్ఘాటించడం విశేషం.

తాను అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, పూర్తి పరిశీలన తర్వాత తన నిర్ణయాన్ని వెలువరిచినట్టు ఏజీ స్పష్టం చేశారు. తాను తొలి లేఖలో పేర్కొన్నట్టుగా సుప్రీంకోర్ట్ సీజే దాని మీద నిర్ణయం తీసుకుంటారని మరోసారి చెప్పారు. అదే సమయంలో తాను అసమ్మతి తెలియజేసినప్పటికీ అడ్వొకేట్ గా ఉన్న ఉపాధ్యాయ సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించవచ్చన్నారు. అంతేగాకుండా సుమోటో యాక్షన్ తీసుకోమని అభ్యర్థించడానికి కూడా అభ్యంతరం లేదన్నారు.