iDreamPost
iDreamPost
జస్టిస్ ఎన్ వీ రమణపై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి ఏపీ సీఎం రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. తాజాగా అటార్నీ జనరల్ దానికి సంబంధించిన వివరణను బీజేపీకి చెందిన అడ్వకేట్ అశ్వినీ ఉపాధ్యాయకు ఇచ్చారు. ఏజీ రాసిన లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు. గత నెల 6వ తేదీన సీఎం జగన్ నేరుగా సీజేకి లేఖ రాయడం, ఆ తర్వాత వాటి వివరాలను ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం మీడియాకు వెల్లడించడం వంటి అంశాలపై సుప్రీంకోర్ట్ కి స్పష్టత ఉందన్నారు. ఏం చేయాలన్నది సీజే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
గత వారం అడ్వకేట్ అశ్వనీ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కి ఓ లేఖ రాశారు. జగన్ చేసిన ఫిర్యాదుని కోర్ట్ ధిక్కరణ కేసుగా పరిగణించాలన్నారు. ఆ లేఖను మీడియాకు వెల్లడించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఏజీ జోక్యం చేసుకోవాలన్నారు. కానీ ఆయన మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. అంతా సుప్రీంకోర్ట్ కి తెలుసునని, తన అనుమతి అవసరం లేదన్నట్టుగా సమాధానమివ్వడం ఆసక్తికరమే. కోర్టు ధిక్కరణ కేసుకి అనుమతివ్వాలని అడ్వకేట్ కోరగా దానికి ఏజీ సూటిగా స్పందించకుండా నిరాకరించినట్టు కనిపిస్తోంది. అడ్వకేట్ అశినీ ఉపాద్యాయ తన లేఖలో వెళ్లబుచ్చిన ఆరోపణలను పరోక్షంగా ఏకీభవిస్తూనే ఈ వ్యవహారం అంతా సుప్రీం కోర్టు చూసుకుంటుందని చెప్పడం గమనార్హం.
ముఖ్యమంత్రి నెల రోజుల క్రితం రాసిన లేఖపై ఇప్పటి వరకూ సుప్రీంకోర్ట్ స్పందించలేదు. సీజే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై భిన్నవాదనలున్నాయి. కాబోయే సీజేగా ఎన్ వీ రమణ కు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు అవసరం ఉంటుందని న్యాయనిపుణులు కొందరు వాదిస్తున్నారు. అయితే లేఖను బహిరంగంగా విడుదల చేయడం పట్ల కొందరు అభ్యంతం వ్యక్తం చేస్తున్న తరుణంలో నేడు ఏజీ స్పందించిన తీరుతో ఇకపై ఇటువంటి లేఖలకు పెద్ద ప్రాధాన్యం ఉండదనే వాదన వినిపిస్తుంది. ఇకపై ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుంది అనేది కీలకం కానున్నది.