iDreamPost
android-app
ios-app

ఆత్మకూర్ – చైర్మన్ పదవి చేపట్టనున్న “బంగారు” డాక్టరమ్మ

ఆత్మకూర్ – చైర్మన్ పదవి చేపట్టనున్న “బంగారు” డాక్టరమ్మ

గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. అదే ఊపు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పునరావృతమైంది. ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిప్పటి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వంతులను ప్రోత్సహిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో దాదాపు 30 మంది డాక్టర్లకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. ఇదే సంస్కృతిని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా డాక్టర్ ఆసియా మారుఫ్ ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటించారు.

డా.ఆసియా వయసు 26 ఏళ్లు మాత్రమే. ఆసియా పార్టీ సీనియర్ నాయకుడు,బంగారు వర్తకుడు ఎంఎ రషీద్ కుమార్తె. ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి, రాజకీయాల మీద ఆసక్తితో పుర పోరులో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ మొట్ట మొదటి చైర్ వుమన్ గా డా. ఆసియా రికార్డుకెక్కనున్నారు. ఈమె వీ ఆర్ కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.2013లో కూడా వైసీపీ తరుపున బంగారు వర్తకుడు నూర్ మొహమ్మద్ చైర్మన్ గా గెలిచారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. ఇందులో వైసీపీ 15 వార్డులను వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. డా.ఆసియా 13వ వార్డు నుంచి బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైంది. టీడీపీ కేవలం 3 వార్డులలో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ సమావేశాలు కూడా నిర్వహించడం లేదంటే ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీ 3 వార్డుల్లో పోటీ చేస్తోంది. జనసేన నుంచి కనీస స్పందన కరువైంది. సీపీఐ, సీపీఎం చెరో వార్డులో బరిలో ఉండగా … వైసీపీ రెబెల్స్ 2 వార్డుల్లో పోటీ చేస్తున్నారు.