iDreamPost
android-app
ios-app

క్రికెట్ @ 99 పరుగుల చరిత్ర

క్రికెట్ @ 99 పరుగుల చరిత్ర

నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం 1973లో ఈ వారం (మార్చి 24-29) కరాచీ మైదానంలో పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ఒక అరుదైన సంఘటనకు వేదికగా నిలిచింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ముగ్గురు బ్యాట్స్‌మన్‌లు 99 పరుగులకు అవుటైన ఏకైక మ్యాచ్ ఇదే.సెంచరీకు ఒక పరుగు దూరంలో 99 పరుగుల వద్ద పాకిస్తాన్ తరఫున మాజిద్ ఖాన్,ముష్తాక్ మొహమ్మద్ ఇంగ్లాండ్ తరపున డెన్నిస్ అమిస్ అవుట్ అయ్యారు.

టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఒక టెస్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 99 పరుగులు మాత్రమే చేసి శతకానికి ఒక పరుగు దూరములో నిలిచిపోయిన సందర్భాలు రెండు…1992 లో క్రైస్ట్‌చర్చ్‌ గ్రాండ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టులో కివీస్ బ్యాట్స్ మెన్లు దీపక్ పటేల్ మరియు జాన్ రైట్ సరిగ్గా 99 పరుగులు చేశారు.1993లో లార్డ్స్‌ మైదానంలో జరిగిన మరో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా మరియు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ ఇద్దరు కూడా 99 పరుగులు మాత్రమే సాధించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా మూడు సార్లు 99 పరుగుల వద్ద ఆగిపోయిన బ్యాట్స్‌మెన్లు నలుగురు.ఆ విషాదకర ఆటగాళ్ళ జాబితాలో చోటు దక్కించుకున్న భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతని అంతర్జాతీయ కెరీర్ 24 సంవత్సరాలు అయినప్పటికీ మూడు 99 పరుగులు ఒకే సంవత్సరం (2007) వన్డేలలో చెయ్యడం విషాదకరం. టెస్టులు, వన్డే రెండింటిలోనూ అజేయంగా 99 పరుగులు చేసిన తొలి ఆటగాడు జాఫ్రీ బాయ్ కాట్.పాకిస్తాన్ బ్యాట్స్‌మన్‌ మిస్బా-ఉల్-హక్ మూడు సార్లు అజేయంగా 99 పరుగులు చేసి శతకం సాధించలేకపోయినా ఏకైక కెప్టెన్.

అంతర్జాతీయ మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద అవుటైన తొలి ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన క్లెమ్ హిల్‌.1902 లో మెల్బోర్న్ ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీకి ఒక పరుగు తక్కువగా చేసి అవుటయ్యాడు.యాదృచ్ఛికంగా తన తదుపరి రెండు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో వరుసగా హిల్ 98 మరియు 97 పరుగులు చేసి సెంచరీలను సాధించకపోవడం గమనర్హం.

అరంగేట్ర మ్యాచ్‌లో 99 పరుగులకు అవుటైన మొదటి బ్యాట్స్‌మన్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థర్ చిప్పర్‌ఫీల్డ్. తాజాగా 2015 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి జెస్ జోనాసెన్ కూడా ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకుంది.టెస్ట్ మ్యాచ్‌లలో వీరితో పాటు రాబర్ట్ క్రిస్టియాని (WD),అసిమ్ కమల్ (PAK) 99 పరుగులకు పెవిలియన్ చేరిన ఆటగాళ్ళు. కాగా ఈ జాబితాలో వన్డేలలో ఐర్లాండ్ తరఫున తన తొలి వన్డేలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ ప్రస్తుత వన్డే కెప్టెన్ ఎయోన్ మోర్గాన్ ఒకరు.ఈ ఐదుగురితో పాటు 2014 లో స్కాట్లాండ్‌తో జరిగిన తన తొలి వన్డే మ్యాచ్‌లో 99 పరుగులతో అజేయంగా యుఎఇకి చెందిన స్వాప్నిల్ పాటిల్ మరొకరు.

ఇప్పటివరకు అన్ని ఫార్మేట్‌లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 99 పరుగులకే పరిమితమైన ఇన్నింగ్స్‌లు 151.ఇందులో బ్యాట్స్‌మెన్లు 142 మంది కాగా మహిళా బ్యాటర్లు సంఖ్య తొమ్మిది.ఒక పరుగు తక్కువగా 99 రన్స్ సాధించిన 151 సందర్భాలలో 23 సార్లు బ్యాట్స్‌మెన్లు అజేయంగా నిలిచారు.