Idream media
Idream media
పెసరపప్పు, బెల్లంతో పాయసం చేయచ్చు. గరళాన్ని చేయలేం. అసురన్ ఒక గరళం. గొంతు దిగుతుంటే మంటపుడుతుంది. దుఃఖం వస్తుంది.
వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాలకి తెలిసిన ఎమోషన్ వేరు. అసురన్‌లో ఉండే ఎమోషన్ వేరు. దళితులు, మైనార్టీలు, మహిళలు వాళ్ల కష్టాలు వాళ్లకే తెలుస్తాయి. బాధను చూసి, చదివి తెలుసుకోలేం. అనుభవిస్తేనే తెలుస్తుంది. సీతమ్మవాకిట్లొ సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ దీన్ని ఎలా తీస్తాడో సరదాగా చదవండి.
ఫస్ట్ సీన్-
వెంకటేష్, అతని 16 ఏళ్ల కొడుకు అడవిలో వెళ్తుంటారు. “నాన్నా మనం ఎందుకు పారిపోతున్నాం” అని కొడుకు అడుగుతాడు. వెంకటేష్ నవ్వి “సంసారమంటేనే పారిపోవడం. భర్తను చూసి భార్య, భార్యని చూసి భర్త, అమ్మానాన్న దెబ్బలాడుతుంటే పిల్లలు ఇలా ఎవరో ఒకరో పారిపోతూ ఉంటారు. ఎక్కడికి పోవాలో తెలియక మళ్లీ వెనక్కి వస్తూ ఉంటారు” అన్నాడు.
మధ్యలో కాలువ వచ్చింది. కొడుకు సంచిని గట్టిగా పట్టుకుని
“నాన్నా, బాంబులు తడిసిపోతాయి” అన్నాడు.
“నవ్వుతూ పలకరించే వారికి బాంబులు అవసరం లేదురా” అన్నాడు వెంకటేష్.
“కానీ మన శత్రువులు చంపడానికి వస్తున్నారు కదా “
“సుమతి శతకకారుడు ఏమన్నాడు, చంపదగినట్టు శత్రువు చేతికి చిక్కినేని…”అని వెంకటేష్ స్పీచ్ స్టార్ట్ చేశాడు.
“నాన్నా నువ్వు సీతమ్మవాకిట్లో ప్రకాశ్‌రాజ్‌వి కాదు, అసురన్‌లో వెంకటేష్‌వి. ఏం మాట్లాడినా ఉపన్యాసానికి తగులుకుంటున్నావ్ ” చిరాగ్గా అన్నాడు కొడుకు.
“నేనేం చేసేదిరా డైరెక్టర్ శ్రీకాంత్‌కి శాంతం తప్ప ఆవేశం లేదు. కత్తితో పళ్లు కోసుకుంటాడు. ఈటెని బూజు కర్ర అనుకుంటాడు” అన్నాడు వెంకటేష్.
కోర్టు దగ్గర సీన్-
లాయర్‌ని జడ్జి “ఏమయ్యా లొంగిపోడానికి వస్తానన్న వెంకటేష్ ఇంకా రాలేదే “అని అడిగాడు.
కోర్టు బయట వెంకటేష్ నవ్వుతూ అందరికీ నమస్కారం చేస్తూ “ఒకర్ని చూసి ఇంకొకరు నవ్వితే కోర్టులు, లాయర్లు, జైళ్లు ఉండనే ఉండవు” అంటున్నాడు.
లాస్ట్ సీన్-
కొడుకుతో వెంకటేష్
“దుడ్డు సంపాదిస్తే గుంజుకుంటారు.
భూమి సంపాదిస్తే గుంజుకుంటారు.
అందుకే చదువుకో
తెలుగు మీడియమే చదువుకో
ఇంగ్లీష్ మీడియంలో నిన్ను చేరనివ్వరు
ఇంగ్లీష్‌ని గుంజుకుంటారు”
(అసురన్ చూసిన వాళ్లకి ఇది అర్థమవుతుంది. అర్థం కాకపోతే అమెజాన్ ఫ్రైంలో చూసిన తర్వాత చదవండి)