హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. ట్యాంక్ బండ్ కు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఆర్టీసీ సమ్మె లో భాగంగా కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కు పోలీస్ లు అనుమతి ఇవ్వలేదు. ఐనా కార్యక్రమం నిర్వహణ పై కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో ట్యాంక్ బండ్ పై ఆంక్షలు విధించారు. అన్ని దారులు దిగ్బంధించారు. కార్మిక నేతలు, కార్మికులను ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు.
సికింద్రాబాద్, ఇందిరాపార్క్, హిమాయత్ నగర్, అసెంబ్లీ, టెలిఫోన్ భవన్, ఖైరతాబాద్, నెక్ల్స్ రోడ్.. ఇలా ట్యాంక్ బండ్ కు వచ్చే మార్గాలను మూసివేశారు. ఆయా రోడ్ల వైపునకు వెళ్లే అన్ని సర్వీస్ రోడ్లనూ బారికేడ్ల తో మూసివేశారు. మూళ్ళ కంచెలను అడ్డుగా పెట్టారు.
ఆయా రోడ్ల నుంచి ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ మళ్లించడంతో ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. సందుగొందుల్లో వాహనదారులు ఇరుక్కుపోయారు. కార్యాలయాలకు వెళ్లే వారు ట్రాఫిక్ లో గంటల కొద్దీ చిక్కుకొనిపోయారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేని పరిస్థితిలో వాహనదారులు నరకయాతనపడ్డారు.