iDreamPost
iDreamPost
మాన్సాస్ ట్రస్ట్.. దీని గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరని అనడం అతిశయోక్తి కాబోదు. ఈ ట్రస్ట్ పేరు చెబితే విజయనగర రాజవంశం గుర్తుకొస్తుంది. దేశంలోనే ప్రముఖ రాజవంశాల్లో ఒకటైన విజయనగరం గజపతి రాజుల వారసులు స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ కుటుంబం ఏర్పాటు చేసిన చారిటీ సంస్థే మాన్సాస్ ట్రస్ట్.
సుమారు రూ. 50 వేల కోట్ల ఆస్తులతో దేశంలోనే సంపన్నమైన ఈ ట్రస్ట్ ఆధిపత్య వివాదం కొన్నాళ్ల క్రితం రాజుకుని కోర్టుల వరకు వెళ్లింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పూసపాటి కుటుంబ వారసుల మధ్య మరో ఆస్తుల పంపకాల వివాదం గురించి చాలామందికి తెలియదు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కొత్త ఆర్బిట్రేటర్ ను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం
విజయనగరం సంస్థానం చివరి పాలకుడైన పూసపాటి విజయరామ గజపతిరాజు (పీవీజీ రాజు) లెక్కకు మిక్కిలిగా ఉన్న తమ కుటుంబ ఆస్తుల్లో సుమారు 14800 ఎకరాల భూములను విద్య తదితర సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ 1958లో మాన్సాస్ ట్రస్టును ఏర్పాటు చేశారు. జీవితాంతం ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ట్రస్టుకు ధారాదత్తం చేయగా మిగిలిన ఆస్తులను 1960లో తన భార్య కుసుమ్ మద్గోంకర్, ముగ్గురు పిల్లలు ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజు, సునీత ప్రసాద్ లకు పంచారు. అయితే తర్వాత భార్య కుసుమకు విడాకులు ఇచ్చి 1963లో మాధురి గజపతిరాజును వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానం అలక్ నారాయణ, మోనిష్, సుధానీ దేవి. ఈ పరిణామాలతో గతంలో చేసిన ఆస్తుల పంపకాన్ని సవరించాల్సి వచ్చింది.
Also Read : T20 WC,Aus Vs Nzl – ఎవరు గెలిచినా.. వారికి ఇదే తొలి కప్
ఆస్తి విభజన, పంపకాల బాధ్యతను బొబ్బిలి కుమారరాజాకు 1970లో అప్పగించారు. ఆ మేరకు కుమారరాజా మొత్తం ఆస్తిని 8 సమభాగాలు చేసి 1971లో పూసపాటి వారసులకు పంచిపెట్టారు. వాటాల విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు వారసులు విజయనగరం సబ్ కోర్టులో కేసు వేశారు. 1993లో సుప్రీంకోర్టుకు చేరిన ఆ కేసు విచారణలో ఉండగానే 1995లో పీవీజీ రాజు కన్ను మూశారు. తర్వాత మధ్యవర్తిత్వం ద్వారా ఆస్తుల పంపకానికి అంగీకరిస్తూ రాజావారి వారసులు ఉమ్మడిగా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు ఆర్బిట్రేటరుగా రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్.రంగనాథన్ ను నియమిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఆస్తి మొత్తాన్ని 7 సమభాగాలుగా విభజిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
స్త్రీధనంపై వివాదం
జస్టిస్ రంగనాథన్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పీవీజీ రాజు రెండో భార్య మాధురీ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఆస్తుల విభజనలో మధ్యవర్తి జస్టిస్ రంగనాథన్ కొన్ని అంశాలు విస్మరించారని పిటిషన్లో పేర్కొన్నారు. కుటుంబానికి చెందిన విలువైన 99 వజ్రాలు, ఒక పచ్చల ఉంగరం గురించి వాటాల్లో ప్రస్తావించలేదని.. అవి స్త్రీధనం కింద తనకు చెందుతాయని మాధురి తన పిటిషన్లో పేర్కొన్నారు. దాన్ని విచారించిన హైకోర్టు స్త్రీధనం విషయంలో ఆర్బిట్రేటర్ పొరపడ్డారని తీర్పు చెప్పింది. కొత్తగా ఆస్తుల విభజనకు జస్టిస్ లక్ష్మణరెడ్డిని ఆర్బిట్రేటరుగా నియమించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పూసపాటి వారసుల్లో ఒకరైన అశోక్ గజపతిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో జస్టిస్ లక్ష్మణరెడ్డి ఏపీ లోకాయుక్తగా నియమితులయ్యారు. తాజాగా ఈ కేసును ఇటీవల విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఏ.గవాయ్ లతో కూడిన ధర్మాసనం కురియన్ జోసెఫ్ ను ఆర్బిట్రేటరుగా నియమించింది. సాధ్యమైనంత త్వరగా తుది అవార్డు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : Tdp Leaders,Real Estate Crime -హైదరాబాద్ రియల్ దందాలో ఇరుక్కున్న టీడీపీ మాజీలు?